పూల పానుపు కాదు జీవితము
ఇది అంపశయ్యతో సమము
వడ్డించిన విస్తరను కొంటివా బ్రతుకు
నేస్తం తెలుసుకోలేవేల శునకాలు చింపు వరకు
నీ వేదన పంచుకోనీయి- ఆవేదన నోదార్చనీయి
నేస్తమా అందుకో నాచేయి-కాస్తైనా ఆసరాకానీయి
1. మేక తోళ్ళను కపుకున్న తోడేళ్ళు- నీ వారని తలపోయు వాళ్ళు
గోముఖ వ్యాఘ్రాలు వాళ్ళు-రంగులెన్నో పులుముకున్నోళ్ళు
స్వేఛ్ఛగా వినువీథిలో తిరుగాడు పావురమా
వేటగాళ్ళ ఉచ్చులకు నువు చిక్కుటే విధివిలాసమా
నీ ఎద విలాపమా
నీ వేదన పంచుకోనీయి- ఆవేదన నోదార్చనీయి
నేస్తమా అందుకో నాచేయి-కాస్తైనా ఆసరాకానీయి
2. తెల్లగా అగుపించువన్నీ పాలు కావు
నల్లగా తలపోయు వన్నీ నీళ్ళుకావు
ఎండమావులు చదరంగ పావులు నీ చుట్టీ జీవులు
క్షీరనీరద న్యాయమెరిగే కలహంసలే నీ గురువులు
నీ వేదన పంచుకోనీయి- ఆవేదన నోదార్చనీయి
నేస్తమా అందుకో నాచేయి-కాస్తైనా ఆసరాకానీయి
3. రామునికై వేచి చూచే శబరిలున్నారు
మాధవునికై చేయి సాచే సుధాములున్నారు
గుండెనిండా నింపుకున్న హనుమ లున్నారు
హృదయమే కైంకర్యమిచ్చిన మీరాబాయిలున్నారు
నీ వేదన పంచుకోనీయి- ఆవేదన నోదార్చనీయి
నేస్తమా అందుకో నాచేయి-కాస్తైనా ఆసరాకానీయి