శ్రమిస్తేనే విజయం విశ్రమిస్తే నెరవేరదు ధ్యేయం
శ్రమయే జీవన సౌందర్యం శ్రమతో నరుల వికాసం
ప్రపంచ కార్మికులారా మీదే నేడే మే డే సంబరం
భవిష్య విధాత లారా మీరు చేసే సృజనే అబ్బురం
జేజేలు జేజేలు శ్రామికులారా జోహారులు కార్మికులారా
1)ఘర్మజలం పారించే జీవ నదులే మీరు
అహరహం ఆరక మండే సూర్యులు మీరు
యంత్రాలను నడిపించే ఇంధనాలు మీరు
సూత్రాలను పాటించే కఠిన నిబద్దత మీ తీరు
జేజేలు జేజేలు శ్రామికులారా జోహారులు కార్మికులారా
2)బడుగు జీవుల అవసరాలు మీవల్లనే తీరు
మధ్యతరగతి సౌకర్యాలు మీ శ్రమతో నెరవేరు
సంపన్నుల విలాసాలకు మూలం చక్కని మీ పనితీరు
మీరు లేని రంగమేది మీ సమ్మెతొ జగమే బేజారు
జేజేలు జేజేలు శ్రామికులారా జోహారులు కార్మికులారా
3)ఎదుగు బొదుగు లేనివి అనాదిగా మీ జీవితాలు
ఆచితుచి పెంచుతారు పోరాడితేనే మీకు జీతాలు
అడుగు అడుగులో పొంచి ఉండే ఎన్నో ప్రమాదాలు
కర్మాగార కాలుష్యలకు బుగ్గిపాలు మీఆయు రారోగ్యాలు
జేజేలు జేజేలు శ్రామికులారా జోహారులు కార్మికులారా
4) లాభాలకై వెంపర్లాటలొ లాలూచితొ యాజమాన్యాలు
జిత్తులు కుయుక్తులెరుగక కార్మికులకు బలి పీఠాలు
ఒక్కతాటిపై కార్మికులంతా చక్కని బాటలొ సాగాలి
వేరుకుంపట్ల కుమ్ములాటలను విజ్ఞత బాయక వీడాలి
జేజేలు జేజేలు శ్రామికులారా జోహారులు కార్మికులారా