Thursday, March 31, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

కవిత్వమంటే కల్పనా చాతుర్యత

కవిత్వమంటే అతిశయమొలికే సామాన్యత

గోరంతలు కొండంతలుగా మలచితే కవిత

నల్లరాతికి నగిషీలు చెక్కితే అద్భుత భావుకత

ఐనా సరే నీమీద చెప్పిన కవితలన్నీ అక్షర సత్యాలే

నిజమే చెలీ నీ గురించి పాడిన గీతాలైతే ఆణిముత్యాలే

1.దేవకన్యలు పోలికలై వరుస కడతారు

అప్సరసలు ఉపమానాలుగ నిలబడతారు

కావ్య నాయికలంతా జేరి నిను కొనియాడేరు

అలంకారమే కవితకు అలంకారమనియేరు

ఐనా సరే నీమీద చెప్పిన కవితలన్నీ అక్షర సత్యాలే

నిజమే చెలీ నీ గురించి పాడిన గీతాలైతే ఆణిముత్యాలే

2.చిలవలు పలవలుగా ఆకసానికెత్తేస్తారు

ఉబ్బితబ్బిబ్బయ్యేలా ఊదరగొడతారు

నీలా ఇలలో లేనే లేరని ఇట్టే పొగిడేస్తారు

కవితావస్తువు వనితైతే మరి కట్టిపడేస్తారు

ఐనా సరే నీమీద చెప్పిన కవితలన్నీ అక్షర సత్యాలే

నిజమే చెలీ నీ గురించి పాడిన గీతాలైతే ఆణిముత్యాలే

No comments: