Monday, March 21, 2022

 రచన,స్వరకల్పన&గానం:  డా.రాఖీ


సొట్టబుగ్గల సొగసెంత - కళ్ళు తిప్పలేనంత

సోగకన్నుల సొబగెంత - కవులు పొగడలేనంత

పలుకులలో పదునెంత- మంత్రముగ్ధులయ్యేంత

నవ్వులలో సుధ ఎంత-మృతులు తిరిగి బ్రతికేంత

నీస్నేహ సౌరభం ఒకవరం- చెలీ నీమనసే అనురాగ సరోవరం


1.మండుటెండలోన నీచెంతన మలయమారుతం

ఎడారిదారులందు ఎదురైతే నీవే ఆమని సంయుతం

కాళరాతిరిలో నీవే వెల్లువయ్యే పూర్ణచంద్రికా పాతం

ఆశల వెలుగుల పొడసూపేటి  తూరుపు సుప్రభాతం

నీస్నేహ సౌరభం ఒకవరం- చెలీ నీమనసే అనురాగ సరోవరం


2. నీవున్న తావులే కమనీయ నందనవనములు

నీసన్నధిలోని క్షణాలే  రాధికాసాంత్వన సమములు

నీ కరస్పర్శ  మరిపించు మయూర పింఛ స్పృశ్యతను

నీ దర్శనమే మురిపించు చకోరి చంద్రికా సదృశ్యతను

నీస్నేహ సౌరభం ఒకవరం- చెలీ నీమనసే అనురాగ సరోవరం

No comments: