Saturday, September 8, 2012

ఆనందం..!కణకణమున..క్షణ క్షణమున..


రాఖీ||ఆనందం..!కణకణమున..క్షణ క్షణమున..!!||

పెంచుకొన్న పావురాన్ని–అరచేతిలొ ఉంచుకొని
ప్రేమగా నిమిరితే ఎంతటి ఆహ్లాదమో..
సాదుకొన్న రామ చిలకని-ముంజేత పెట్టుకొని
జిలిబిలిగా పలికితే ఎంత మోదమో..

దొరకని దెక్కడా-ఆనందమె అంతటా
అనుభవించు హృదయముంటే లభియించును అన్నిటా

1.       నింగి లోని సింగిడి చూసి-అబ్బురంగ ఆస్వాదిస్తూ
మైమరచి పోతుంటే పరితోషము..
ఊరవతలి చెరువు లోనా-వచ్చీరాక ఈడులాడుతూ
కేరింతలు కొడుతూ ఉంటే సంతోషము..

దొరకని దెక్కడా-ఆనందమె అంతటా
అనుభవించు హృదయముంటే లభియించును అన్నిటా

2.       తొట్లెలోని పాపతోటి-వెర్రి మొర్రి చేష్టలు చేస్తూ
తుళ్ళి తుళ్ళి నవ్విస్తుంటే..చెప్పరాని పరవశము
కల్లాకపట మెరుగని వారితో-కల్మషమే లేని మనసుతొ
కబురులాడుతుంటే కొదవలేని హర్షము...

దొరకని దెక్కడా-ఆనందమె అంతటా
అనుభవించు హృదయముంటే లభియించును అన్నిటా

3.       కోరి కోరి పొందిన దాన్ని-అడిగినదే తడవుగా
ఆత్మీయుల కందజేస్తే అభినందము
పోరి పోరి గెలిచిన దాన్ని-నవ్వుతు తృణప్రాయంగా
పరాజితుల కొదిలేస్తే ప్రహ్లాదము

దొరకని దెక్కడా-ఆనందమె అంతటా
అనుభవించు హృదయముంటే లభియించును అన్నిటా



Wednesday, September 5, 2012

“సంగీతా౦గన”


“సంగీతా౦గన”
నఖ శిఖ పర్యంతమూ
నువ్వే సంగీతమూ
ఏ చోట మీటినా 

అద్భుత మగు నాదము


1.       నువ్వు నవ్వు నవ్వితే
మువ్వలే మ్రోగుతాయి
నీ నడకలు సాగితే
మృదంగాలు నినదిస్తాయి
చేయి కదిపినావంటే
సంతూరు స్వానమే..
కన్ను గిలిపినావంటే
సారంగి సవ్వడే

2.       పలుకు పలికి నావంటే
వీణియ బాణము.
గొంతు విప్పినావంటే
సన్నాయి మేళము
మేను జలదరించెనా
జలతరంగమే
మౌనము దాల్చినా
తంబురా రావమే

Thursday, August 23, 2012

ప్రేమ పట్టకం(ప్రిజం)


ప్రేమ పట్టకం(ప్రిజం)

వర్ణాలు రెండే ఈ ప్రేమకు
వర్ణాలు మెండే ఈ ప్రేమకు
తెల్లగా కనిపిస్తుంది-మెల్లగా కబళిస్తుంది
చల్లనీ బ్రతుకులనెన్నో నలిపి నలుపు చేసేస్తుంది

1ఊదా రంగు ఊహల్లో విహరింప జేస్తుంది
నేరేడువన్నెయే   ఆశలు కలిపింప జేస్తుంది
నీలిరంగు మేఘాల్లో తేలియాడ జేస్తుంది
ఆకుపచ్చ కలలెన్నో కనుల కలగజేస్తుస్తుంది
మంత్రాలు వేస్తుంది-మాయలెన్నొ చేస్తుంది
కన్నుమూసి తెరిచే లోగా పంజరాన బంధిస్తుంది

2.పసుపు పచ్చ  బంధాలే పెనవేస్తుంది
బంగారు భవితను చూపి మురిపిస్తుంది
సంజె కేంజాయిలోనా ..రంజింపజేస్తుంది
రక్తానురక్తిగా జీవితాన్ని మార్చేస్తుంది
మత్తు కలుగ జేస్తుంది-మైకాన్ని కమ్మేస్తుంది
ఏడేడు జన్మలదాకా వెంటాడి వేధిస్తుంది



Thursday, July 26, 2012

స్వయం’భు’వన మోహిని



స్వయంభు’వన మోహిని

వర్ణించలేదు ఎవరూ..కావ్యాలలో...- 
తిలకించలేదు ఎపుడూ...స్వప్నాలలో...
సాక్షాత్కరించినావు....రెప్పవేయనీయనట్లుగ- ప్రత్యక్షమైనావు  .....సాగిలపడునట్లుగా
        ప్రసాదించవే చెలి... క్రీగంటి వీక్షణం.
       కై౦కర్యమైపోతానే.నా.జీవితాంతం

1. సుందరాంగులెందరో...చేస్తారు వందనాలు..
అందగత్తెలె౦దరో....దాసోహమంటారు
ముజ్జగాల ముదితలు సైతం చేష్టలుడిగి చూస్తారు
బ్రహ్మ కూడ నిన్ను చూసి బిత్తర పడిపోతాడు      
అతిలోక సుందరీ..అన్న పేరు నీదేనేమో.
నీ దర్శన భాగ్యమే నా పూర్వ పుణ్యమేమో

2. దేవతవు నీవనను..మాయమైపోదు వేమో..
అప్సరసవు నీవనను...అందకుండా పోదువేమో..
నీ దరహాసం కురిసే  శరత్కాల జ్యోత్స్న లు
నీ నయనాల మెరిసే నక్షత్ర జ్యోతులు
ఏమందు నే నిన్ను కుందనాల బొమ్మా..
తనివిదీర నిన్నుగనగ  సరిపోదు ఒక జన్మ

3.  పెద్దన నిను చూసి ఉంటే..ఉన్మత్తుడయ్యే వాడేమో..
శ్రీనాథుడు నిన్ను గాంచి ఉన్మదితుడుఅయ్యేనేమో
వర్ణాలు  సరిపోవే..నిన్ను వెలయించ
పదములకు..పాటు గాదే..నిను ప్రస్తుతించ
మతిభ్రమించకముందే..నన్ను కాస్త దయగనవే
వెర్రి శ్రుతి మించక ముందే..నన్నిక గైకొనవే..