Tuesday, March 12, 2013

“జీవిత ‘గీత’(౦)”


“జీవిత ‘గీత’(౦)”

తలమీద కొలువైన గంగ వననా- తనువులో సగమైన గౌరి వననా
హృదయాన స్థిరమైన సిరివి నీవననా- జిహ్వపై నర్తించు శ్రీవాణి వననా

ఓ ప్రణవేశ్వరీ - నా ప్రాణేశ్వరీ
నా ప్రణయ మహారాణి వననా- నా జీవన సామ్రాజ్ఞి వననా

1.   ఏడు జన్మాలలో ముడివడిన బంధమా
ముడులు మూడైననూ విడివడని పాశమా
ఏడడుగులేసినా ఎడతెగని స్నేహమా
నూరేళ్ళు సాగేటి అనవరత మోహమా
మధురిమలు కురిపించు అనురాగమా
మధువెంత గ్రోలినా తీరని దాహమా

ఓ ప్రణవేశ్వరీ - నా ప్రాణేశ్వరీ
బ్రహ్మ రాసిన నుదుటి గీత వననా- నా జీవన సామ్రాజ్ఞి వననా

2.   పసిపాపగ కుడిపించే అమ్మవే నీవు
కనుపాపగ ననుగాచే రెప్పవేనీవు
అందాలతొ నినదించే స్వరవీణవే నీవు
మురిపాలతో మురిపించే నెరజాణవే నీవు  
తలలోని నాల్కవై నడిపించే యుక్తి నీవు
అను నిత్యం ననుభరించె క్షమయా ధరిత్రి నీవు

ఓ ప్రణవేశ్వరీ - నా ప్రాణేశ్వరీ
బ్రతుకు నేర్పెడి కృష్ణ గీత వననా- నా జీవన సామ్రాజ్ఞి వననా

3.   నాలోనవనాడుల ప్రవహించును నీ ప్రేమే
ఎద లయలో అనుక్షణం అనునాదం నీ ప్రేమే
నా కన్నులు వెదజల్లెడి కాంతిజల్లు నీ ప్రేమే
నా నవ్వులు విరజిమ్మే పరిమళం నీ ప్రేమే
నా పలుకులు అలవోకగ ఒలికి౦చును నీ ప్రేమే
నా కవితలు తన్మయముగ చిలికించును నీ ప్రేమే

ఓ ప్రణవేశ్వరీ - నా ప్రాణేశ్వరీ
భవిత చూపెడి అరచేతి గీత వననా- నా జీవన సామ్రాజ్ఞి వననా







Sunday, January 6, 2013

గుచ్చితే నేమి..గుండెలో సూది


పల్లవి:గుచ్చితే నేమి..గుండెలో సూది
చేరింది మల్లి నీ వక్షస్థల సన్నిధి..
పుట్టితేనేమి పంకమందు నళిని ..
అయ్యింది పద్మము నీ పాద దాసీ.

అను పల్లవి:మూడు నాళ్ళయితె నేమి జీవిత కాలం..
వెదజల్లగ పరిమళాల కౌముది..
రెప్పపాటైతెనేమి..ఆయుర్దాయం 
సేవించి తరించగా శ్రీ చరణ యుగ
ళి

1.     పువ్వు పువ్వు పైన వాలి మకరందము గ్రోలి
తేనెపట్టు ప్రక్రియలో తను సాంతం కాలి
పంచామృతాలలోన..మధువు ను అందించి
నీ అభిషేకసేవలోన తరించదా..మధుపం
మూడు నాళ్ళయితె నేమి జీవిత కాలం..
వెదజల్లగ పరిమళాల కౌముది..
రెప్పపాటైతెనేమి..ఆయుర్దాయం 
సేవించి తరించగా శ్రీ చరణ యుగళి

2.     అల్లికయే వేదముగా స్వేదమంత వొలకబోసి
వొంటి లోని జిగురునంత ఒద్దిక గా గూడు నేసి
నువు కట్టే పట్టుబట్టకు బ్రతుక౦తా ధార బోసి
ధన్యత నొందింది పట్టు పురుగు సేవ జేసి
మూడు నాళ్ళయితె నేమి జీవిత కాలం..
వెదజల్లగ పరిమళాల కౌముది..
రెప్పపాటైతెనేమి..ఆయుర్దాయం 
సేవించి తరించగా శ్రీ చరణ యుగళి








Saturday, January 5, 2013

https://youtu.be/FcKvj48X0fs

రాఖీ||“వందే ధర్మపురీ నారసింహం “||

చల్లనీ నీ చూపుకు చంద్ర హారతి
కమ్మని నీనవ్వుకు కర్పూర హారతి
చక్కనైన నీ రూపుకు  శుభహారతి
ధర్మపురినరసింహా మంగళ హారతీ -నీ కిదే మంగళ హారతీ

1.     హిరణ్య కశ్యపు శమన నీకు జయ హారతి
ప్రహ్లాద వరద నీకు ప్రియహారతి
నారద మునివినుతనీకు నక్షత్ర హారతి
శేషప్ప కవి భూషిత సూర్య హారతి- నీ కిదే మంగళ హారతీ

2.     గోదావరి తటవిరాజ జ్ఞాన హారతి
అగ్రహార ద్విజపూజిత వేద హారతి
శ్రీ లక్ష్మీ ప్రియవల్లభ గాన హారతి
అనాధనాధ సుజననేత హృదయ హారతి- నీ కిదే మంగళ హారతీ

3.     భూషణ వికాస నీకు భవ్య హారతి
దుష్ట సంహార నీకు దివ్య హారతి
ఉగ్ర యోగ రూప స్థిత రమ్య హారతి
సమవర్తి విధిసేవిత నవ్య హారతి- నీ కిదే మంగళ హారతీ

ఈ పాటకు నా  స్వర కల్పన కై..క్రింది లింక్ చూడండి



Friday, December 28, 2012

https://youtu.be/-sS8CRO3RMU?si=oJtfe2YoweOYjY7X

నిమిషమైన నా మది 
నీ మీద నిలుపకుంటి నే మది 
దయగనవయ్య పరమ దయాంబుధి
ధర్మపురి నారసింహ నెమ్మది

చ.1.కనుల ఎదుట నిలిచినా కా౦చ కుంటినయ్య స్వామి
పదియడుగులదవ్వుకైననడువకుంటినయ్య స్వామి
కరకమలాలతోను పూజించకుంటినయ్య స్వామి 
నోరార నీ భజన చేయకుంటినయ్య స్వామి

చ.2.నోములు వ్రతములు చేయకు౦టినయ్య స్వామి
వేదమంత్రాదులెపుడుచదువకుంటినయ్య స్వామి
యజ్ఞ యాగాది క్రతువు లెరుగ కుంటి నయ్య స్వామి 
దాన ధర్మాదులైనచేయకు౦టినయ్య స్వామి

చ.3.ఏ రీతిగా నన్ను నీవు ఉద్ధరింతువో ప్రభూ
ఏ తీరుగ భవ తీరంచేర్చనుంటివో హరీ 
ప్రహ్లాద వరద నీకు ప్రణమిల్లెద నయ్య స్వామి 
శేషప్ప వినుత నిన్ను శరణంటినయ్య స్వామి

Monday, December 24, 2012

“మనోరంజని “

“మనోరంజని “

నీ పాదాల క్రింద నలిగినా చాలని – రాలినాయి దారంతా పారిజాతాలు
నీ తనువును స్పర్శించే భాగ్యమె పొందాలని – వీచినాయి రోజంతా మలయ మారుతాలు
నీ ఓర చూపు వాలినా మేలని – వరుస కట్టినారు తాపసులె౦దరో
నీ చిరునవ్వు జారినా ఏరుకొని - దాచుకొనే ధన్య జీవులె౦దరో

1. నీవు జలక మాడాలని – తహతహ లాడినది నది
నిను చుట్టి మెరవాలని – తపించిపోయింది చీర మది
నీ మెడలో నగగ మారి –తరించాలనుకొన్నది సురభి (బంగారం)
నీ జడలో విరిగా జేర – తనువు చాలించింది గులాబి

2. నీ మేని ఛాయ కాయగా - రవికి అడ్డునిలిచింది మేఘము
నిను మురిపింప జేయ – నెలపొడుగున కాయాలని యోచించె చంద్రాతపము
ఇంద్రధనుసు నిన్ను మించ –కొత్త వర్ణాలు కోరి ఆచరించె తపము
సృష్టి లోని పూవులన్ని బేషరతుగ మెచ్చెను నీ అందము

3. కలనైనా కనిపి౦చెదవోయని – నిద్రలోనె గడిపితి దినమానము
ఊహకైనా వరించాలని -కలవరిస్తిని నేను అస్తమానమూ
నా హృదయం నీ జన్మస్థానం –అసమాన సుందరీ
నా జీవితమే చేసితి కైంకర్యం- అనుపమాన సుకుమారి

Saturday, September 8, 2012

ఆనందం..!కణకణమున..క్షణ క్షణమున..


రాఖీ||ఆనందం..!కణకణమున..క్షణ క్షణమున..!!||

పెంచుకొన్న పావురాన్ని–అరచేతిలొ ఉంచుకొని
ప్రేమగా నిమిరితే ఎంతటి ఆహ్లాదమో..
సాదుకొన్న రామ చిలకని-ముంజేత పెట్టుకొని
జిలిబిలిగా పలికితే ఎంత మోదమో..

దొరకని దెక్కడా-ఆనందమె అంతటా
అనుభవించు హృదయముంటే లభియించును అన్నిటా

1.       నింగి లోని సింగిడి చూసి-అబ్బురంగ ఆస్వాదిస్తూ
మైమరచి పోతుంటే పరితోషము..
ఊరవతలి చెరువు లోనా-వచ్చీరాక ఈడులాడుతూ
కేరింతలు కొడుతూ ఉంటే సంతోషము..

దొరకని దెక్కడా-ఆనందమె అంతటా
అనుభవించు హృదయముంటే లభియించును అన్నిటా

2.       తొట్లెలోని పాపతోటి-వెర్రి మొర్రి చేష్టలు చేస్తూ
తుళ్ళి తుళ్ళి నవ్విస్తుంటే..చెప్పరాని పరవశము
కల్లాకపట మెరుగని వారితో-కల్మషమే లేని మనసుతొ
కబురులాడుతుంటే కొదవలేని హర్షము...

దొరకని దెక్కడా-ఆనందమె అంతటా
అనుభవించు హృదయముంటే లభియించును అన్నిటా

3.       కోరి కోరి పొందిన దాన్ని-అడిగినదే తడవుగా
ఆత్మీయుల కందజేస్తే అభినందము
పోరి పోరి గెలిచిన దాన్ని-నవ్వుతు తృణప్రాయంగా
పరాజితుల కొదిలేస్తే ప్రహ్లాదము

దొరకని దెక్కడా-ఆనందమె అంతటా
అనుభవించు హృదయముంటే లభియించును అన్నిటా



Wednesday, September 5, 2012

“సంగీతా౦గన”


“సంగీతా౦గన”
నఖ శిఖ పర్యంతమూ
నువ్వే సంగీతమూ
ఏ చోట మీటినా 

అద్భుత మగు నాదము


1.       నువ్వు నవ్వు నవ్వితే
మువ్వలే మ్రోగుతాయి
నీ నడకలు సాగితే
మృదంగాలు నినదిస్తాయి
చేయి కదిపినావంటే
సంతూరు స్వానమే..
కన్ను గిలిపినావంటే
సారంగి సవ్వడే

2.       పలుకు పలికి నావంటే
వీణియ బాణము.
గొంతు విప్పినావంటే
సన్నాయి మేళము
మేను జలదరించెనా
జలతరంగమే
మౌనము దాల్చినా
తంబురా రావమే