Tuesday, March 12, 2013

“జీవిత ‘గీత’(౦)”


“జీవిత ‘గీత’(౦)”

తలమీద కొలువైన గంగ వననా- తనువులో సగమైన గౌరి వననా
హృదయాన స్థిరమైన సిరివి నీవననా- జిహ్వపై నర్తించు శ్రీవాణి వననా

ఓ ప్రణవేశ్వరీ - నా ప్రాణేశ్వరీ
నా ప్రణయ మహారాణి వననా- నా జీవన సామ్రాజ్ఞి వననా

1.   ఏడు జన్మాలలో ముడివడిన బంధమా
ముడులు మూడైననూ విడివడని పాశమా
ఏడడుగులేసినా ఎడతెగని స్నేహమా
నూరేళ్ళు సాగేటి అనవరత మోహమా
మధురిమలు కురిపించు అనురాగమా
మధువెంత గ్రోలినా తీరని దాహమా

ఓ ప్రణవేశ్వరీ - నా ప్రాణేశ్వరీ
బ్రహ్మ రాసిన నుదుటి గీత వననా- నా జీవన సామ్రాజ్ఞి వననా

2.   పసిపాపగ కుడిపించే అమ్మవే నీవు
కనుపాపగ ననుగాచే రెప్పవేనీవు
అందాలతొ నినదించే స్వరవీణవే నీవు
మురిపాలతో మురిపించే నెరజాణవే నీవు  
తలలోని నాల్కవై నడిపించే యుక్తి నీవు
అను నిత్యం ననుభరించె క్షమయా ధరిత్రి నీవు

ఓ ప్రణవేశ్వరీ - నా ప్రాణేశ్వరీ
బ్రతుకు నేర్పెడి కృష్ణ గీత వననా- నా జీవన సామ్రాజ్ఞి వననా

3.   నాలోనవనాడుల ప్రవహించును నీ ప్రేమే
ఎద లయలో అనుక్షణం అనునాదం నీ ప్రేమే
నా కన్నులు వెదజల్లెడి కాంతిజల్లు నీ ప్రేమే
నా నవ్వులు విరజిమ్మే పరిమళం నీ ప్రేమే
నా పలుకులు అలవోకగ ఒలికి౦చును నీ ప్రేమే
నా కవితలు తన్మయముగ చిలికించును నీ ప్రేమే

ఓ ప్రణవేశ్వరీ - నా ప్రాణేశ్వరీ
భవిత చూపెడి అరచేతి గీత వననా- నా జీవన సామ్రాజ్ఞి వననా







No comments: