Sunday, May 31, 2009

నాలుకా! నా నాలుకా
నీకెందుకే వాచాలత-నీకేలనే చాపల్యత
అంటే అనునీవు హరి నామము-లేకుంటె పాటించవే మౌనము
పెట్టింది తినకుంటె నీదే లోపము
రుచి మరచిపోకుంటె పస్తే తథ్యము
1. దంతాలు నిన్నెంత బంధించినా-చింతన్నదే లేక చిందులు వేస్తావు
అధరాలు నిన్నెంత వారించినా-బెదురన్నదే లేక వదురుతూ ఉంటావు
భాషణల ముత్యాలు నువు దాచుకుంటావు
మాటల తూటాలు పేల్చుతూ ఉంటావు ||అంటే||

2. షడ్రుచులు తీవ్రమై బాధించినా-వెర్రిగా వాటికై అర్రులు చాస్తావు
పంచభక్ష్యాలు...రోగాల పెంచినా-లక్ష్యపెట్టక నీవు విందులారగిస్తావు
ప్రాణాలు హరియించె ధూమపానమే ప్రియమా
నీకు జీవశ్చవమొనరించు మధువే ఇష్టమా ||అంటే||


No comments: