స్నేహించు నేడు-వీడ్కోలొక నాడు
ఆశిస్తేనే భంగపాటు
స్వీకరిస్తె ఏదైనా
ఖేదానికి ఉండదు చోటు
1. భావం సంకుచితమైతే-స్వార్థం చెలరేగుతుంది
దృష్టే భిన్నమైపోతే-అర్థం మారిపోతుంది
హృదయమెంత వ్యాకోచిస్తే-కాయమంత తేలికలే
శ్వాసయెంత నెమ్మదిస్తే-ఆయువంత అధికములే
2. బావియే బ్రతుకైపోతే-కప్పకంటె గొప్పేముంది
మనసే ఒక పంజరమైతే-స్వేఛ్ఛకు తావెక్కడుంది
ఏదీ నీది కానపుడే- అంతాసొంత మౌతుంది
ఎవరికీ చెందకుంటేనే-అందరితో బంధముంటుంది
3. నీటికి రుచి ఉంటుందా-ఖనిజాలతొ కలవకుంటే
కాంతికి రంగుంటుందా-కిరణాలే నిలువకుంటే
ఎదగాలి అంబరమంత-ఒదగాలి సాగరమంత
అనురాగం విశ్వజనీనం-ఆనందం ఆత్మగతం
No comments:
Post a Comment