ఏ పేరని నిను పిలువనురా - నామాలన్నీ నీవే ఐతే
ఏ చోటని వెదకనురా - సర్వాంతర్యామి వైతే
చూసిందేమని ఈ మోహం – తెలిసిందేమని ఈ వింత దాహం
1. నీవున్నావనునది నిత్య సత్యం
నీ అనుభూతులు నిత్య కృత్యం
గాలివి నీవై నా సేద దీర్చేవు
నీరువు నీవై నా తృష్ణ దీర్చేవు
నీ రూపమేదో ఎరుగకున్నను
అపురూపమే ప్రభూ నీ భావనలు
2. మన మధ్యనున్నది ఏ అనుబంధం
ఏ జన్మలోనిది మన సంబంధం
నను నడిపించే ఓ మార్గదర్శీ
నను పాలించే ఓ చక్రవర్తీ
నాకు తెలిసింది నీ ఆరాధనయే
నా ధ్యాన మంతా నీ సాధనయే
3. నాకు వలసింది నీకెరుకలేదా
నన్నుడికించుటయే నీ సరదా
ఇద్దరమూ వేరు వేరైతెనే కద
అత్మ పరమాత్మ అద్వైతమేకద
త్వమేవాహం స్థాయి దాటితే
విశ్వనినాదం సోహం సోహం సోహం
No comments:
Post a Comment