Sunday, November 15, 2009

OK

స్త్రీ నిత్యకృత్యాలే నృత్యరీతులు
నారీమణి నడకలే నాట్య శాస్త్రాలు 
అంగన భంగిమలే రంగరంగ వైభవాలు 
నితంబినీ కదలికలే చకిత దివ్య విలాసాలు 

కల్లాపిచల్లితే – రంగవల్లి దిద్దితే 
తులసికోట చుట్టూ బిరబిరా తిరిగితే 
కురులార బెట్టితే-వాల్జెడనే అల్లితే 
మల్లెపూలమాల గట్టి కొప్పులోన తుఱిమితే 
అంగన భంగిమలే రంగరంగ వైభవాలు 
నితంబినీ కదలికలే చకిత దివ్య విలాసాలు 

పాలను పితికితే-పెరుగును చిలికితే 
తలపైనాకటిలోనా బిందెలతో నీళ్ళు తెస్తె 
రోకటి పోటేస్తే-చాటతొ చెరిగేస్తే 
ఒళ్ళంతా ఊయలవగ జల్లెడతో జల్లిస్తే 
అంగన భంగిమలే రంగరంగ వైభవాలు 
నితంబినీ కదలికలే చకిత దివ్య విలాసాలు 
 
వడివడిగా వండితే –వయ్యారంగ వడ్డిస్తే 
కడుపారగ కొసరి కొసరి విందారగింపజేస్తె 
తాంబూలం చుట్టితే- అంగుళితోనోటికిస్తె 
కొఱకబోవు అంగుటాన్ని కొంటెగా తప్పిస్తే 
అంగన భంగిమలే రంగరంగ వైభవాలు 
నితంబినీ కదలికలే చకిత దివ్య విలాసాలు 
 
మేని విరుపులు-మూతి విసరులు 
సిగ్గుతో నేలమీది బొటనవ్రేలు రాతలు 
కంటి భాషలు-మునిపంటినొక్కులు 
కడకొంగును వ్రేలిచుట్టుచుట్టుకొలతలు 
అంగన భంగిమలే రంగరంగ వైభవాలు 
నితంబినీ కదలికలే చకిత దివ్య విలాసాలు 

దుప్పటి మారిస్తే-శయ్యను సవరిస్తే 
చేయిపట్టి చేరదీయ చిలిపిగ వదిలించుకొంటె 
పాలను అందిస్తే-మురిపాలను చిందిస్తే 
అర్ధనారీశ్వరాన కైవల్య గతిసాగితె 
అంగన భంగిమలే రంగరంగ వైవిభవాలు 
నితంబినీ కదలికలే చకిత దివ్య లాసాలు 

అతిథుల ఆహ్వానం అపర కూచిపూడి
పండగ సందడిలో అభినవ కథాకళి 
భామిని చైతన్యం అమోఘ భరతనాట్యం 
రమణి రూపులో అభినయ నటరాజే ప్రత్యక్షం 
అంగన భంగిమలే రంగరంగ వైభవాలు 
నితంబినీ కదలికలే చకిత దివ్య విలాసాలు 

No comments: