Saturday, February 20, 2010

https://youtu.be/6fPSeKYkmuk

తెలుగు ప్రజల తెలుగుజాతి (తెలుగు భాషా )మాతృభాషా దినోత్సవ సందర్భంగా-

తేనె వంటిదీ మన తెలుగు కదా
’మరి చే’దెలా అయ్యింది మాతృభాష-మన మాతృభాష
అమ్మ అంటెనే హాయికదా
’మమ్మీ’ అనుమాటలో ప్రేతమనీ తోచదా
కన్నతల్లి కన్నమిన్న ఇంకేది లోకాన
సొంతఊరు అవ్వనుడుగు సాటిలేనివెపుడైనా

1. క్షరము కానిదే అక్షరము కదా
కొఱవడుతున్నాయెలా క్ష ఱ లు
సమసిపోనిదే వర్ణం కదా
లుప్తమెలా అయ్యాయి ఌ ౡ లు
ఇంద్ర ధనుసు కున్నవి ఏడే వర్ణాలు
తెలుగు భాష వర్ణాలు యాభయ్యారు

2. ఋణములు,ౠకలు నిత్యాగత్యమే కదా
మాయమెలా అయ్యాయి ఋ,ౠలు
మనఃపూర్వకంగా తెనుఁగు అనాలన్నా
అవసరమవుతాయికదా అరసున్నా విసర్గలు
భిన్నమైన యాసలే తెలుగు గర్వకారణం
ముత్యాల దస్తూరే తెలుగులిపికి ఆభరణం

3. అచ్చరువొందే అచ్చరాలే
అచ్చతెనుఁగుకే మెచ్చుతునకలు
దేశ భాషల్లో తెలుగు లెస్సగా
రాయల పలుకులే జిలుగు కణికలు
నిలపాలి మనమెప్పుడు తెలుగు ఆత్మగౌరవము
గుర్తెరిగీ మసలాలి తెలుగు భాష గొప్పదనం
తూర్పులోని ఇటలిభాషగ కీర్తించెను ప్రపంచం

Sunday, February 14, 2010

త్యాగానికి ప్రతిరూపం నాన్న!

నాన్నా నీవేలే త్యాగానికి ప్రతిరూపం
నాన్నా నీవేమా ఈ ఉన్నతి తార్కాణం
ఏమి చేసినా గాని తీరిపోదు నీ ఋణం
ఈయగలము మనసారా మా అశ్రుతర్పణం

1. అనురాగ మూర్తియైన అమ్మను నా కిచ్చేసి
ఆనందలోకమైన అమ్మఒడిలొ నను వేసి
కాలుకంది పోకుండా భుజాన నను మోసి
అందమైన బాల్యాన్ని అందజేసావు వెఱసి

2. దొంగబుక్కలెన్నెన్నో కుడిపించావు
అంగలేయ వేలుపట్టి నడిపించావు
కంటి చూపుతోనే క్రమశిక్షణ నేర్పావు
మౌనదీక్షతోనే నిరసన ప్రకటించావు

3. మా పోషణె ధ్యేయంగా బ్రతుకు ధార పోసావు
రేయిపవలు మాకోసం నీరెక్కలు వంచావు
ఎంతకష్టమైనా సరె నవ్వుతు భరియించావు
నీ బిడ్డలమైనందుకు గర్వపడగ పెంచావు
నాన్న అంటె ఇలాగే ఉండాలనిపించావు

Saturday, February 13, 2010

ఎక్కడ పుట్టావే ప్రేమా... గుండెలొ ఎప్పుడు అడుగెట్టావే
ఎందుకు వచ్చావే ప్రేమా... నా మదికి ఎలాగ నచ్చావే
నా ప్రమేయమే లేదు- నాప్రయత్నమే లేదు
చాపక్రింది నీరు లాగ - ఆక్రమించుకున్నావే
కన్నుమూసి తెఱిచేలోగా- నన్ను దోచుకున్నావే

1. వాలే పొద్దుకు వాన జల్లుకు-ముడి పెడతావు
నీ అవతారం ఇంద్రధనుసుగా-చూపెడతావు
వాలే తేటికి విరిసిన విరికీ-జత కడతావు
నీ ప్రతిరూపం మాధుర్యంగా-తలపిస్తావు
మాయలాడివే ప్రేమా-గారడీలు చేస్తావు
మాయలేడివే ప్రేమా-విరహాలు సృష్టిస్తావు

2. రాధామాధవ చరితం అంతా-నువ్వే నిండావు
ప్రణయం అంటే సరియగు అర్థం-జగతికి తెలిపావు
రతీ మన్మధుల ఆంతర్యమే-నీ జన్మకి కారణం
పతీ పత్నుల సాహచర్యమే-నీ ఉనికికి తార్కాణం
దైవత్వం నీవే ప్రేమా- లీలలెన్నొ చూపేవు
అద్వైతం నీవే ప్రేమా-శాశ్వతంగ నిలిచేవు

ఎరుగని ఓ నగ్న సత్యం ప్రేమా- ఎరిగిన గూఢ రహస్యం ప్రేమా

ఎరుగని ఓ నగ్న సత్యం ప్రేమా- ఎరిగిన గూఢ రహస్యం ప్రేమా
తెలిసితెలిసీ జనులు ఎందుకో ప్రేమిస్తారు
సాఫీగ సాగే నావను సుడిలోన ముంచేస్తారు
1. ప్రేమ పుట్టుకనే ఎరుగం-ప్రేమ గిట్టుటనే ఎరుగం
నట్టనడిమి సంద్రంలో కొట్టుమిట్టాడుతునే ఉంటాం
ప్రేమ ఒక గమ్మత్తు-అనురాగమే మత్తు
మనచిత్తమన్నది చేయిజారితే భవిష్యత్తే చిత్తు
బయటపడలేని ఉబి ప్రేమైనా-త్రెంచుకోలేని వల ప్రేమైనా
తెలిసి తెలిసీ జనులు ఎందుకో దిగబడతారు
ప్రేమకొరకై మూర్ఖులు వెర్రిగా ఎగబడతారు
2. అందాల హంగులు ఉంటాయి
పరువాల పొంగులు ఉంటాయి
మనసు వయసూ ఎపుడూ దొంగాటలాడుతు ఉంటాయి
విధి వేచి చూస్తుంది-గారడీలు చేస్తుంది
పొరపాటుచేసి ప్రేమిస్తే మన పనిపడుతుంది
ప్రేమ సాలెగూడైనా-ప్రేమే ఉరిత్రాడైనా
తెలిసితెలిసీ జనులు ఎందుకో చిక్కడతారు
భగ్నమైన హృదయంతో బేలగా తలపెడతారు
3. మజ్నూల గాథలు వింటారు
దేవదాసు కథనే వింటారు
అనార్కలిని సమాధిచేయడం-అందరూ ఎరిగే ఉంటారు
కావ్యాలు చదివేస్తారు-కన్నీరు కార్చేస్తారు
తమదాక వస్తేనే కథ మళ్ళీ మొదలెడతారు
ప్రేమ గరళమే ఐనా- ప్రేమ నరకమే ఐనా
తెలిసి తెలిసీ జనులు ఎందుకో తాగేస్తారు
ప్రేమకొరకై అందరు ఎందుకో పడిఛస్తారు
ఆనందమనుకొని తామే వేదనను కొనితెస్తారు................................!!!??

Friday, February 12, 2010

https://youtu.be/NuT9iodQ_6A


శ్రీ రాజ రాజేశ్వరా నీరాజనం శంకరా
చంద్రశేఖరా హరా-భస్మధరా సుందరా
గంగాధరా శివా-వృషభ వాహనా భవా
హేఅర్ధ నారీశ్వరా-నమో రామ లింగేశ్వరా

1. జ్వాలనేత్ర దహియించు-చెలరేగే మా కోర్కెలు
గరళకంఠ హరియించు-ప్రకోపించె దుష్కర్మలు
ఐశ్వర్యమీయరా ఈశ్వరా-పరసౌఖ్యమీయర పరమేశ్వర
చంద్రశేఖరా హరా-భస్మధరా సుందరా
గం గా ధరా శివా-వృషభ వాహనా భవా
హేఅర్ధ నారీశ్వరా-నమో రామ లింగేశ్వరా

2. బుద్బుదమీ జీవితము-కలిగించు సాఫల్యం
అద్భుతమే నీ మంత్రం-కావించు ఉపదేశం
కైలాసవాసా హేమహేశ్వరా-కైవల్యదాయకా కరుణించరా
చంద్రశేఖరా హరా-భస్మధరా సుందరా
గంగాధరా శివా-వృషభ వాహనా భవా
హేఅర్ధ నారీశ్వరా-నమో రామ లింగేశ్వరా

Friday, February 5, 2010


శివలీలలే పాడనా-భవసాగరమును
అవలీలగా ఈదాడనా
శివ పదములు దాల్చ-నా-కవితలలో
ప్రతి పదమున కొనియాడనా

1. భవహరుడు-మనోహరహరుడు-భవుడు-ప్రణవ సంభవుడు
త్రిపురాసుర సంహరుడు-త్రిశూలధరుడు-భార్గవుడు
పంచభూతాత్మకుడు-పరమేశ్వరుడు-పంచాననుడు-ప్రభవుడు
దక్షాధ్వరధంసి-సతిప్రియతమ పతి-సదాశివుడు-విభవుడు

2. గంగాధరుడు-లింగస్వరూపుడు-జంగమదేవుడు-దిగంబరుడు
గౌరీవిభుడు-గజచర్మధరుడు-గరళకంఠుడు-జటదారీ -గిరీశుడు
అర్ధనారీశ్వరుడు-తాండవప్రియుడు-నటరాజేశ్వరుడు-అభవుడు
కపాలధరుడు-భూతనాథుడు-కాలకాలుడు-మృత్యుంజయుడు

3. భోలాశంకరుడు-అభయంకరుడు-భక్తవశంకరుడు-నభవుడు
రుద్రుడు-వీరభద్రుడు-కాలభైరవుడు-నిటలాక్షుడు
శంభుడు-శాంభవీ వల్లభుడు-సద్యోజాతుడు-సర్వజ్ఞుడు
సాంబుడు-నాగాభరణుడు-శశిధరుడు-త్రియంబకుడు

4. వృషభవాహనుడు-వసుధారథుడు-వామదేవుడు-విధుడు
శమనరిపుడు-కపర్ది-నీలకంఠుడు-నిరంజనుడు
పింగాక్షుడు- దూర్జటి-పినాకపాణి- పశుపతి-పురహరుడు
భస్మాంగుడు-రాఖీసఖుడు-ధర్మపురీశుడు-శ్రీరామలింగేశుడు

Tuesday, February 2, 2010

ఆత్మహత్య ఎలాచూసినా-అవమానం అతిహేయం

నేర్పుతుంది జీవితమే
అనుక్షణం కొత్త పాఠమే
ఓడిపోతుంది ఒకనాడు ఓటమే
ఓర్పుతో సాధిస్తే వరించేను విజయమే
1. అద్భుతాలు జరిగి ఎవ్వరూ- కాలేదు గొప్పవారు
అదృష్టం నమ్ముకొని అవలేదు-మహానీయులు
ఇటుక మీద ఇటుక పేర్చి -కడితేనే మేడగ మారు
పునాదియే పటిష్టమైతే –కట్టడాలు చరితనుచేరు
2. నిద్రలేమి రాత్రులెన్నో- గడిపారు కీర్తి చంద్రులు
సాధనయే ఊపిరిగా- సాగారు లక్ష్య పథికులు
పక్కదోవ పట్టలేదు –ఎన్నడైనా విజేతలు
ధ్యేయాన్ని మరువలేదు –కలనైనా జిష్ణువులు
3. భగీరథుని సంకల్పం-అవ్వాలీ నీకభిమతం
సడలని విక్రమార్కుని-పట్టుదలే నీకాదర్శం
ఏకలవ్యు నేకాగ్రతయే- ఎప్పటికీ నీకు హితం
అభిమన్యుని విక్రమతే-సదా నీకు ప్రామాణ్యం
4. ఆత్మహత్య ఎలాచూసినా-అవమానం అతిహేయం
కన్నవారి గుండెకోత- అసమానం దయనీయం
సంపూర్ణ ఆయుర్దాయం-సర్వులకిల అనుభవనీయం
ప్రయత్నిస్తె ఎన్నటికైనా-పాదాక్రాంతం నీకు జయం