Friday, November 26, 2010

https://youtu.be/fobFYjVFrLs

“’కమ్మ’-నీ” గీతిక

ఎందుకమ్మా ఓ కమ్మా-నీకు అంత సహనం (కమ్మ=కాగితం=paper)
నేలకైనా ఉందా అమ్మా-నీ అంత సత్వగుణం
ఎపుడైనా వస్తే భువికే కోపం-తెస్తుంది తెగటార్చే భూకంపం
దెబ్బతింటె భూ పర్యావరణం-రాస్తుంది జీవ జాతికే మరణ శాసనం

1. స్వఛ్ఛమైన నీ మనసుపై-పిచ్చి రాత రాస్తారు
శ్వేతవర్ణ దేహం పైన -గీతలెన్నొ గీస్తారు
కలాలతో కఠినంగా రాసి గాయం చేస్తారు
ముద్రించే తరుణంలో-యంత్రాల్లో నలిపేస్తారు
చరిత్రనే మోసుక వచ్చిన ఘన చరితే నీదమ్మా
నిన్ను మఱచి ఏమరిస్తే మాకు భవిత లేదమ్మా

2. వ్యాసవాల్మీకాదులు –అక్కున నిను జేర్చారు
కవిత్రయము నిన్నెపుడూ పుత్రికగా చూసారు
అష్ట దిగ్గజాలు నీకు సాష్టాంగ పడ్డారు
జ్ఞానపీఠాధిరోహులు వేలుపుగా కొలిచారు
వెదురు నిన్ను కన్న తల్లి మా కల్పవల్లి
వేణువే నీకు చెల్లి ఓ పాలవెల్లి

3. జ్ఞానమొసగు దేవతగా నిన్నారాధిస్తారు
నేర్చుకున్న అనుభవాలు నీలొ పదిల పరిచేరు
అనుభూతులు పంచుకొని చరితార్థను చేస్తారు
తప్పుగా భావించకమ్మా-తల్లిగ నిను ప్రేమిస్తారు
ఏది చేసినా గాని ఉభయ కుశలోపరే నమ్మా
బాధ కలిగించినా సదుద్దేశమే గదమ్మా

OK

2 comments:

Anonymous said...

kamma = letter, not paper

DR.GOLLAPELLI RAMKISHAN RAKI DHARMAPURI said...

మీ సునిశిత పరిశీలనా పటిమకు జోహార్లు..ధన్యవాదాలు!
మీరు నిఘంటు పరంగా సరిగానే తెలిపారు.అయితే..ముఖ్యంగా తాటికమ్మ(తాటాకు) లోనుండి ఈ కమ్మ అనే వాడుక పదం వచ్చింది..తాళపత్ర గ్రంథాలు అనబడే వన్నీ తాటికమ్మల పైనే వ్రాసిన సంగతి మీకు తెలియంది కాదు..తెలంగాణాలో ఈ కమ్మ అంటే కాగితం అనే అర్థంలో వాడటం నాకు తెలుసు..చిన్నతనంలో ..నా బుక్ నుండి రెండు కమ్మలు చించేసాడు అని టీచర్కి పిర్యాదు చేసే వాళ్ళం..తెలంగాణా..ముఖ్యంగా కరీంనగర్ ప్రాంతీయులెవరైనా నా అభిప్రాయాన్ని సమర్థిస్తారని,,ఆశిస్తున్నాను. మరీ ముఖ్యంగా జాబు అన్నపదాన్ని కూడ లేఖగానే కాక కాగితం అనే అర్థంలో వాడటం కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో కద్దు/రివాజు