Friday, December 24, 2010

“ఏదో రాయి”

“ఏదో రాయి”

రాయివై పోయినావా
చెలీ పరాయివై పోయినావా
నట్టనడి సంద్రాన నా బ్రతుకు నావా
ముంచేసినావా-నను వంచించినావా

1. సూదంటురాయిలా ఆకట్టుకొన్నావే
గీటురాయి మీద గీసి నాడి పట్టుకొన్నావే
తూనికరాయితొ మనసును సరితూచుకొన్నావే
కలికితురాయిలా సిగ దాల్చుకొన్నావే

నట్టనడి సంద్రాన నా బ్రతుకు నావా
ముంచేసినావా-నను వంచించినావా

2. కొక్కిరాయిదొంగజపం చేస్తావని అనుకోలేదు
కీచురాయిలా కఠోరంగ రొద చేస్తావనుకోలేదు
కల్తీ సారాయిలాగ ముప్పుతెస్తావనుకోలేదు
ప్రేమ పావురాయి గొంతు నులిమేస్తావనుకోలేదు

నట్టనడి సంద్రాన నా బ్రతుకు నావా
ముంచేసినావా-నను వంచించినావా

1 comment:

veera murthy (satya) said...

wow....

మీ కవితల్లో పదాలు చాలా ప్రయోగాత్మకంగా ఉంటాయి..
పదాల మీద పదజాలం మీదా మీకు చాలా పట్టుంది....