Tuesday, July 26, 2011

నేడు నా అర్ధాంగి-గీత-జన్మదిన సందర్భంగా- “గీతార్చన

నేడు నా అర్ధాంగి-గీత-జన్మదిన సందర్భంగా-
“గీతార్చన”
అనురాగం పుట్టిన రోజు ఇది- అభిమానం పొంగిన రోజు ఇది
గంగ అవతరించినది-గీతను ప్రవచించినది
హరివిల్లిల విరిసినది-హరునివిల్లు విఱిచినది
ఈనాడే ఈనాడే చిగురించె ప్రతి మోడే
నేడు గీత బర్త్ డే-ఆనందాల సందడే
హాప్పీ బర్త్ డే టూయు-గీతా- హాప్పీ బర్త్ డే టూయూ

1. బంగారాన్ని కరిగించి-శ్రీగంధాన్ని రంగరించి
లావణ్యాన్ని మేళవించి-దృష్టిని కేంద్రీకరించి
పోతపోసినాడు నిన్ను ఆ బ్రహ్మా- అందానికి నిర్వచనం నీవేనమ్మా
మానవతను కుమ్మరించి-భూతదయను కూర్చిఉంచి
సంస్కారాన్ని కలబోసి-లౌక్యమంత పోగుచేసి
తీర్చిదిద్దినాడు నిన్ను సృష్టి కర్త- ధన్యుడాయె నినుగని వాణిభర్త

2. చిద్విలాస విలాసానివి-ఆదరణలొ అన్నపూర్ణవి
క్షమలొనీవు క్షితీదేవివి-అలుపెరుగని అలకనందవి
నీవున్నచోట పదుగురి నెలవమ్మా-అమావాస్య నాడైన కురిసేటి వెన్నెలవమ్మా
నీకులేదు చేతికి ఎముక-ఆతిథ్యంలొ నీవే పొలిక
వాదనతో చేస్తావ్ తికమక-ఎన్నటికీ నీదే గెలుపిక
ఆత్మగౌరవం నీకు ఆభరణం-అత్మీయత నీ ఇంటి తోరణం

_ప్రేమతో రాఖీ 27-07-2011

Sunday, July 24, 2011

https://youtu.be/N-WqK9TZPTk

అపర కైలాసమే వేములవాడ
అడుగడుగున శివుడిజాడ తఱచి చూడ
తలాపునే గంగయుండ దప్పిగొన్నవాడ
తీర్చగలడు రాజన్న మోహదాహాలనీడ
1. నీమొక్కులు సిద్దించగ సిద్ది గణపతి
అపారముగ ఈయగలడు నీకు సంపతి

ఆదరించి అభయమొసగి అమ్మ రాజేశ్వరి
తొలగించును నీకొచ్చిన ప్రతీ ఆపతి

బెంబేలయి దిక్కేతోచకున్నవాడ
రాజేశుని సన్నిధిలో భరోసాగ నిదురపోర

2. పీడలన్ని రూపుమాపు బద్దిపోచమ్మ
ముడుపుగట్టిబోనమిస్తె మురియునన్న

కొండంత అండనీకు మంచుగుండె భీమన్న
చెంబునీళ్ళుకుమ్మరిస్తె సంబరపడునన్న

పాపాలుసమసిపోవు మునకేస్తె (ధర్మ)గుండాన
కోడెగడితె వృద్ధిజెందు వంశమింక తరతరాన




Friday, July 8, 2011

ప్రణయ ప్రబోధం

ప్రణయ ప్రబోధం

మానిపోతున్న గాయాన్ని కెలుక మాకు
మరుగుపడిన స్మృతులేవి గురుతు తేకు
గడచిపోయెమన గతమంతా ఒక పీడకలగా
మసలుకోవమ్మ ఇకపై ఓ అపరిచితగా

1. తలపుకొచ్చు చిహ్నాలన్నీ చెఱిపివేయి
అపురూప కాన్కలన్ని పారవేయి
మన ఉమ్మడిగ ఇష్టాలను వదిలివేసేయి
పంచుకొన్న అనుభూతులు పాతఱవేసేయి
ఏ జన్మకు చెయిసాచకు స్నేహమనే ముసుగుతో
ఏ బంధం ఆశించకు నయవంచక వాంఛతో

2. ఇంద్రజాలమంటి చూపు ఇకవాడబోకు
చంద్రశాలమల్లె నవ్వు ప్రదర్శించకు
అర్భకు’లౌ’ అర్చకులతొ ఆటలాడకు
నిజాయితే లేక ఎపుడు ప్రవర్తించకు
అందాన్ని ఎరవేసి పబ్బాన్ని గడుపుకోకు
ప్రేమయే దైవమన్న సత్యాన్ని మరచిపోకు

Friday, July 1, 2011

“జ్ఞాపకాల అంపకాలు”

“జ్ఞాపకాల అంపకాలు”

భాష చెప్పలేని భావం-స్పర్శ తెలుపుతుంది
మనసు విప్పలేని మర్మం-చూపు చాటుతుంది
అనుభూతుల సారం ఎపుడూ-అనుభవైక వేద్యమే
మధురమైన స్మృతులన్నీ-అనుక్షణం హృద్యమే

1. సంవత్సరమంతా- వసంతమే ఉండదు
నూరేళ్ళ బ్రతుకంతా-ఆనందం నిండదు
చీకటే లేకపోతే వెలుగుకున్న విలువేది
ఆకులే రాలకుంటే-కొత్త చివురు సృష్టేది

ఆడుకో నేస్తమా -జీవితం కేళిగా
మసలుకో మిత్రమా- వైకుంఠపాళిగా

2. ప్రభాతాలు సాయంత్రాలు-రోజూ అతిసహజాలు
కలయికలు వీడ్కోళ్ళు-పయనంలో పదనిసలు
వరదనీరు వచ్చేస్తే-పాతనీరు మటుమాయం
గడిపిన మన సంగతులెపుడు-మరపురాని మధుకావ్యం

నెమరువేయి నేస్తమా-దిగులుగా ఉన్నపుడు
దరికిచేరు మిత్రమా-గుబులుగా ఉన్నపుడు