Wednesday, August 24, 2011

భక్త’వ’శంకరా!

గళసీమ గరళాన్ని సహియించినావు
శిరమందు నభగంగ భరియించినావు

ఇంతకన్న ఏముంది తార్కాణం
భోళాశంకరా నీది సార్థక నామం

మహాదేవ మహాదేవ నీలకంధరా పాహి
వామదేవ వ్యోమకేశ గంగాధరా దేహి

1. పులితోలు వలువల్లె ధరియించినావు
నాగుల్ని నగలల్లె మెయి దాల్చినావు
భస్మాన్ని ఒళ్ళంత పులిమేసుకున్నవు
వృషభాన్ని తురగంగ ఊరేగినావు

ఇంతకన్న ఏముంది తార్కాణం
భోళాశంకరా నీది సార్థక నామం

సద్యోజాత తత్పురుషా భూతనాథ పాహి
ఈశానా అఘోరా అనాధ నాథ దేహి

2. నిలువనీడలేకనీవు కొండకోననుండేవు
ఊరువాడ విడిచివల్ల కాడున మసలేవు
తపమైన చేసెవు-చితులైన పేర్చేవు
మోదమైన క్రోధమైన చిందులేసి ఆడేవు

ఇంతకన్న ఏముంది తార్కాణం
భోళాశంకరా నీది సార్థక నామం
నిటలాక్ష నటరాజ విరూపాక్ష పాహి
పశుపతి ఫాలనేత్ర కాలభైరవా దేహి

3. ఇల్లిల్లు బిచ్చమెత్తి బొచ్చెలోన తింటావు
నీ కడలేనిదైన ఐశ్వర్యమునిస్తావు
అడిగితెఅనుచితమైనా అర్ధాంగి నిచ్చేస్తావు
అదియిదియనిగాదు ఆత్మనె అర్పిస్తావు

ఇంతకన్న ఏముంది తార్కాణం
భోళాశంకరా నీది సార్థక నామం

జంగమయ్య లింగమూర్తి ఋతంబరా పాహి
చంద్రమౌళి పింగళ పినాకపాణి దేహి

No comments: