Tuesday, February 14, 2012

అరుణాచల శివా అరుణాచల శివా అరుణాచల శివా

కరుణ ధార కురిపించే అరుణాచల శివ
మరణబాధ తొలగించే అరుణాచల శివ
విశ్వవ్యాప్త విమల రూప తేజోలింగ శివ
ఆదిమద్యాంత రహిత హే పరమ శివా
అరుణాచల శివా అరుణాచల శివా అరుణాచల శివా

1. మాయమ్మ అన్నపూర్ణ ఆలి కదా నీకు
ఈ కలిలో ఆకలి కేకల కలతల నీయ మాకు
బిక్షమెత్తైనసరే ఎవరిని పస్తుంచబోకు
బిచ్చములో బిచ్చమట రాజేశుని బిచ్చమట
ఋజువు పఱచు క్షుద్బాధ తీర్తువన్న మాట
అరుణాచల శివా అరుణాచల శివా అరుణాచల శివా

2. దిగంబరా త్రయంబకా హే త్రిపురారీ
సుశరీర దాయక జటాఝూట ధారీ
రుజలు రుగ్మతలు వ్యాధులు పరిమార్చరా
మహామృత్యుంజయా శంభో సుధాంశ శేఖరా
అపమృత్యుహాని మాపి ఆరోగ్యమీయరా
అరుణాచల శివా అరుణాచల శివా అరుణాచల శివా

3. పంచభూతాత్మకా ఆకసలింగా చిదంబరా
పంచానన వాయులింగ శ్రీకాళహస్తీశ్వరా
పంచప్ర్రాణాధిపా తేజోలింగ అరుణాచలేశ్వరా
పంచభాణధారిహారి జలలింగ జంబుకేశ్వరా
పంచేంద్రియపాలక పృథ్విలింగ ఏకామ్రేశ్వరా
అరుణాచల శివా అరుణాచల శివా అరుణాచల శివా

4. చిదానంద రూప సదానంద దాతా
భస్మ చందనార్చిత భవబంధ మోచక
త్రిశూలపాణీ కపర్దీ కపాల ధారి
సన్మార్గ బోధక జగద్గురో చంద్ర మౌళీ
నటరాజ హఠయోగీ అందుకో హృదయాంజలి
అరుణాచల శివా అరుణాచల శివా అరుణాచల శివా

No comments: