Monday, January 22, 2018

రచన:రాఖీ

మూసిన రెప్పల వెనుక దాగిన కలలెన్నో
తెరిచిన కన్నులగుండా కారిన అశ్రువులెన్నో
జీవితమే రంగుల ఇంద్రచాపము
జీవితమే మరీచికలా అశనిపాతము-తీరని తాపము

1.నిర్మాణపు నైపుణ్యం చూడు- పెట్టిన పిచ్చుక గూడు
చీమలపుట్టలు పాములపాలైతే చింతించకు ఏనాడు
జీవితమే ఊహల వింత సౌధము
జీవితమే అంతేలేని చింతల అగాధము

2.నిద్రించని రాత్రుల కృషితో నీ భవితకు నిచ్చెనలు
అడ్డదారుల వరదల్లో మునిగిన ప్రతిభావంతెనలు
జీవితమే ఎగిరే గాలి పటము
జీవితమే వదలని కంపల లంపటము

3.చీకటి వద్దనుకొనుటే చిత్రమైన పేరాశ
వెలుతురే రాదనుకొంటే
వ్యర్థమే ఆ నిరాశ
జీవితమే ఆటుపోట్ల సాగరము
జీవితమే సుఖదుఃఖాల సంగమము

Sunday, January 21, 2018

కరుణించలేవా మరణించులోగా
దయమానినావా నవనీత హృదయ
నీ మననం లేక నేనిల మనలేను
నువు లేని బ్రతుకే ఊహించలేను
నేస్తమై రావా దేవీ ఆసరాగా అందించు చేయి

1.చూపుల పూలతో కొలిచేను నేను
పలుకుల స్తోత్రాల అర్చింతునేను
ఉఛ్వాసనిశ్వాస ధూపాలు వేసేను
ప్రాణాలనైదు వెలిగించినాను
నేస్తమై రావా దేవీ ఆసరాగా అందించు చేయి

 2.పగలే కురిసేను వెన్నెల్లు నీవుంటే
ఆమనే వెన్నంటు నువుతోడుఉంటే
ఆహ్లాదమేనీ సావాసమెపుడు
ఆనందమేనీ సాన్నిధ్యమెపుడు
నేస్తమై రావా దేవీ ఆసరాగా అందించు చేయి
తిరిగిరాని లోకాలకు తరలినావా
మధురమైన మీ స్మృతులను వదలిననావా
ఓ మనీషీ ఓ మహాత్మా ఓ ధన్య చరితా
కాకెర్ల దత్తాత్రేయ శర్మా పరోపకార పరాయణా స్వధర్మా
మనసావాచా కర్మణా అందుకో మా నివాళి
మరువలేరు మిమ్మెరిగిన జనాళి

1.మాన్యుడివైనా మనినావు సామాన్యుడిలా
కర్మయోగివై నిలిచావు జనులకు ఆప్తుడిలా
వృత్తిలో ప్రవృత్తిలో ప్రత్యేకత నిలుపుకొని
తలలోని నాలుకగా ప్రతిఫలించినావు-ప్రతిభచాటినావు
॥ఓ మనీషీ॥

2.పురాణ ప్రవచనం జ్యోతిష్య గణనం
సంగీతనాటక రంగాలలో ప్రావీణ్యం
పాటైనా పద్యమైన గాత్రమే కడు హృద్యం
కరతలామలకమే మీకు విద్య,వైద్యం
॥ఓ మనీషీ॥

3.బంధుగణమునందున అందరివాడివి
వెన్నుతట్టి ధైర్యమిచ్చు నిజనేస్తావి
హాస్య  భాషణా భూషణ చతురుడినవి పురోహితుడివి
చంద్రకళాయుత సంసార ధీర నావికుడివి
॥ఓ మనిషీ॥
కొలిచేరు నిన్ను కోటానుకోట్లు
నువులేవనంటే నే నమ్ముటెట్లు
ఓ చిద్విలాసా సాయీ
ఓ చిన్మయానంద సాయీ
 నాపైన నీవేల దయ మానినావు
నన్నేల మరచి నువు మౌనివైనావు

1.మనిషై వెలసిన దైవానివా
దైవంగ మారిన మానవుడవా
పెట్టేరు నీకు మణిమయ మకుటాలు
కట్టేరు నీకుపట్టు పీతాంబరాలు
పట్టేరు ప్రతిపూట పంచహారతులు
హుండీలో దక్షిణలునీ చుట్టూ ప్రదక్షిణలు

నువ్వంటు ఉంటే ఈ బింకమేల
నావంక చూడంగ తాత్సారమేల

2.గురువారమొస్తే నీ గుడి తిరునాళ్ళే
రోజంతా నీ భక్తులకుపవాసాలే
ఏముంది నీవద్ద ధునిలో విభూది
కాశీయా తిరుపతా షిరిడీ సమాధి
వేలం వెర్రిగా ఎగబడే జనాలు
వ్యధతీర్తువనుకొనే ఈ నీరాజనాలు

ఆనందమేల హరియింతువయ్యా
నీ ఉనికికిఇకనైన ఋజువీయవయ్యా

Tuesday, January 9, 2018



నీ దాసుడనే నీ ధ్యాసుడనే
నిమిషము మరువని నీ భక్తుడనే అనురక్తుడనే
దయగను దేవీ హృదయముగనవే
కణకణమూ నీ భావనయే
అనుక్షణమునీ ఆరాధనయే

1.నీ పద సన్నధి నాకది పెన్నధి
నీ వీక్షణలో కరుణరసాంబుధి
నీ దరహాసము నిజ మధుమాసము
నీ సాన్నిధ్యము నిత్య కైవల్యము 
దయగను దేవీ అనురాగము గనవే
అక్షరమౌ నీ భావనయే
సలక్షణమౌ నీ సాధనయే

2.నీ పూజకు నే చామంతిని
నీ ఆటకు నే పూబంతిని
నటనలు చాలించి అక్కున జేర్చవె
చరణము లందించి  గ్రక్కున బ్రోవవె
పలుకుల రాణీ నను చులకన జేయకు
శరణము నీవే శరదిందు వదన
ననునడిపించవె సవ్య పథమున.. నవ్య పథమున

OK

Monday, January 8, 2018

రాఖీ॥విరహిణి

రాధిక రాదిక
గోపాలా...
కరిగే కల చేదిక
ఎద కలచే దిక
ఏవేళా...
నా జీవనమున బృందావనమున
కలువల కన్నుల
ఎదురు తెన్నులా...

1.అకులసడినీ రాకగ పొరబడి
కోకిలపాటని మురళీ రవమని
పొదలో కదిలే నెమలి నీ పింఛమని
ఆరాటపడితిని నేభంగపడతిని

2.పున్నమి వెన్నెల ఉసిబోవనేల
అన్నులమిన్నల ఊరించనేల
వెన్నలదొంగా బాసలు నీకేల
వన్నెలు మార్చే మోసములేల

Tuesday, January 2, 2018

అలాగేకాని ప్రభూ అలాగేకానీ
ఇలా వేధించడం నీకిష్టమైతే
అలాగేకానీ అలాగేకానీ
జాలిమానిన కర్కషుడిలా
కరుణనెరుగని రాక్షసుడిలా
ఇలా హింసించడం నీకిష్టమైతే
అలాగే కానీ అలాగే కానీ

1.దయగలిగిన దాఖలాయే ఎరుకలోన లేనే లేదు
పసితనాన సైతం కనికరించిందిలేదు
పుట్టిబుద్దెరిగేనాడు సుఖపడ్డ రోజేలేదు
నీసృష్టిలోపాన్ని సవరించు సోయేలేదు
అలాగేకాని ప్రభూ అలాగేకానీ
ఇలావంచించడం నీకిష్టమైతే
అలాగే కానీ అలాగే కానీ

2.వింతవింత వ్యాధులన్ని అంటగట్టిఆనందిస్తావ్
భరించరాని వెతలలొ నెట్టి పదేపదే చోద్యం చూస్తావ్
సూదిపోట్లు గుచ్చిగుచ్చి వాయిదాల్లొ చంపేస్తావు
భూతలాన వెదికితె దొరకని కౄరమైన శిక్షలువేస్తావ్
అలాగే కాని ప్రభూ అలాగే కానీ
ఇలా నేఅఘోరించడం నీ తత్వమైతే
అలాగే కానీ అలాగే కానీ