Monday, January 22, 2018

రచన:రాఖీ

మూసిన రెప్పల వెనుక దాగిన కలలెన్నో
తెరిచిన కన్నులగుండా కారిన అశ్రువులెన్నో
జీవితమే రంగుల ఇంద్రచాపము
జీవితమే మరీచికలా అశనిపాతము-తీరని తాపము

1.నిర్మాణపు నైపుణ్యం చూడు- పెట్టిన పిచ్చుక గూడు
చీమలపుట్టలు పాములపాలైతే చింతించకు ఏనాడు
జీవితమే ఊహల వింత సౌధము
జీవితమే అంతేలేని చింతల అగాధము

2.నిద్రించని రాత్రుల కృషితో నీ భవితకు నిచ్చెనలు
అడ్డదారుల వరదల్లో మునిగిన ప్రతిభావంతెనలు
జీవితమే ఎగిరే గాలి పటము
జీవితమే వదలని కంపల లంపటము

3.చీకటి వద్దనుకొనుటే చిత్రమైన పేరాశ
వెలుతురే రాదనుకొంటే
వ్యర్థమే ఆ నిరాశ
జీవితమే ఆటుపోట్ల సాగరము
జీవితమే సుఖదుఃఖాల సంగమము

No comments: