Wednesday, August 1, 2018

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

కరకు హృదయ ముంటుందా కన్నతల్లికి
కరుణకు లోటుంటుందా కల్పవల్లికి
జగన్మాతవన్న మాట అనృతమేనా
అమ్మలకే అమ్మవంది అది నిజమేనా
ఎలా ఊరుకుంటావు మావెతలు చూసి
మిన్నకుందువెందుకు మా యాతన తెలిసి

దయను కురియ జేయవమ్మా దాక్షాయిణి
ఎద మురియగ కాయవమ్మా నారాయణి

1.బ్రతుకునింత ఇరుకు చేసి బావుకున్నదేమిటి
మనసుకింత మంటబెట్టి వినోదింతువేమిటి
నిధులడిగానా నిన్ను ఎన్నడైనా
పరమ పదమడిగానా నేను ఎప్పుడైనా
మామూలుగ మమ్ములనిల గడపనిస్తే అది చాలు
సంతృప్తితొ కడదాకా మననిస్తే పదివేలు

వెతలు త్రుంచవమ్మ మావి వాగధీశ్వరీ
మమత పంచవమ్మ మాకు మాధవేశ్వరి

2.అల్లుకున్న పొదరిల్లును మరుభూమిగ మార్చావు
కట్టుకున్న కలలమేడ నిర్దయగా కూల్చావు
పదవిమ్మని కోరలేదె పొరబాటుగను
ఆస్తికొరకు పోరలేదె నాహక్కుగనూ
ఒంటికెపుడు నలతనైన కలిగించకు తల్లీ
ఇల్లంతా తుళ్ళింతలు నింపివేయి మళ్ళీ

దండించిన దిక చాలు కాత్యాయణి
పండించవె భవితనైన బ్రహ్మచారిణి

https://www.4shared.com/s/f2JD540r_fi

No comments: