Friday, August 2, 2019

జాతిని గమనించలేదు రాముడు సుగ్రీవుడు
కులమునెంచలేదు కృష్ణుడూ కుచేలుడు
తాహతులను తలచలేదు సుయోధన కర్ణులు
కులమతాలకతీతమే ఎప్పుడూ స్నేహితము
గాఢత ఎంతో కలిగిన వింత బంధము మైత్రీ బంధము

1.రంగును రూపును అసలే లెఖ్ఖించదు
వయసును విద్వత్తును పరిగణించదు
మగనా మగువనా అనికూడా చూడదు
ఎవరెవరికి మధ్యన ఏర్పడునో స్నేహితము
గాఢత ఎంతో కలిగిన వింత బంధము మైత్రీ బంధము

2.ప్రయాణాల్లొ మొదలౌను ఒక స్నేహము
కలంతోనె కుదురుతుండె అలనాటి స్నేహము
గొడవతొ సైతం బలపడును మరొక స్నేహము
సామాజిక మాధ్యమాల దీనాటి స్నేహము
గాఢత ఎంతో కలిగిన వింత బంధము మైత్రీ బంధము

3.సాహిత్యం వారధిగా సాగేనొక స్నేహము
సంగీతం సారథిగా చెలఁగేనొక స్నేహము
అభిరుచులతొ వికసించేనొక స్నేహము
ఇవ్వడమే ఎరిగినది మధురస్నేహము
గాఢత ఎంతో కలిగిన వింత బంధము మైత్రీ బంధము

No comments: