Thursday, January 23, 2020

రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:భూపాలం

వేకువ జామాయే వేంకటేశ్వరా
వేగిరమే మేలుకొనీ మాకు మేలుకూర్చరా
అలమేలు మంగమ్మ అపుడే లేచిందీ
ఇల జనులకు సిరులనొసగ తలమునకలుగానుంది

1.నారదాది మునులంతా బారులు తీరారు
ఇంద్రాది దేవతలూ ఆత్రుతతో నిలిచారు
వాగ్గేయకారులంత గీతాలతొ పొగిడేరు
నీ భక్తవరులూ గోవింద ధ్వానాల మునిగారు

2.అభిషేకమొనరించ గంగమ్మ వేచింది
పట్టుపీతాంబరాల పద్మావతి పట్టుకొంది
పారిజాత పుష్పాలను శచీదేవి తెచ్చింది
హారతినీకీయగా భారతియూ వచ్చింది

3.శుభములనొనగూర్చరా జగమునకెప్పుడు
కలతల పరిమార్చరా కలివరదా ఇప్పుడు
మాపై కురిపించరా నీ కరుణను గుప్పెడు
మానవతే నినదించనీ మా గుండె చప్పుడు

No comments: