Sunday, March 15, 2020


చేపరూపుదాల్చి సోమకుణ్ణి జంపి
వేదాలను కాచావు వేదవేద్యా వేంకటేశా
సాగరాన్ని మథించగా మంథరగిరిని మోయగా
కూర్మావతారివై కూర్మికూర్చినావు దేవతారాధ్యా శ్రీనివాసా
ఎత్తక తప్పదిపుడు నరజాతిని రక్షింపగా
ఏదో అవతారం ఏకాదశావతారం
ధన్వంతర మూర్తివై సంజీవని మాత్రవై
ఉద్భవించి నెరపాలి కరోనాది వ్యాధుల సంహారం

1వరాహమూర్తివై  హిరణ్యాక్షు వధియించి
భువి చెఱ విడిపించావు వడ్డికాసులవాడా
నరకేసరి రూపుదాల్చి హిరణ్య కశిపు దునిమి
ప్రహ్లాదుని బ్రోచావు ఆపదమ్రొక్కులవాడా
వామన భార్గవ అవతారములెత్తి దాన ధర్మ
వైశిష్ట్యము తెలిపావు వకుళా నందనా
ఎత్తక తప్పదిపుడు నరజాతిని రక్షింపగా
ఏదో అవతారం ఏకాదశావతారం
ధన్వంతర మూర్తివై సంజీవని మాత్రవై
ఉద్భవించి నెరపాలి కరోనాది వ్యాధుల సంహారం

2.సీతా రామునిగా మానవీయ విలువలనే
జగతికి తెలిపావు జగదానందకారకా
శ్రీ కృష్ణ మూర్తిగా జగద్గురువు నీవై
గీతను బోధించావు గోవింద ప్రియ నామకా
బుద్ధ కల్క్యి రూపుడవై లోకోద్ధరణ జేసి
ప్రసిద్ధికెక్కినావు తిరుమల గిరి దీపకా
ఎత్తక తప్పదిపుడు నరజాతిని రక్షింపగా
ఏదో అవతారం ఏకాదశావతారం
ధన్వంతర మూర్తివై సంజీవని మాత్రవై
ఉద్భవించి నెరపాలి కరోనాది వ్యాధుల సంహారం

No comments: