Wednesday, March 25, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:దర్బార్ కానడ

సాగర కెరటాలై నీ కరములు
నర్తించువేళల ఉత్తుంగ తరంగాలు
జలపాత ధారలై నీ పదములు
కదలాడు సమయాన ఉరకల తురంగాలు
అభినవ మయూరమా అభినయ మరాళమా
నీ తనువే సప్తవర్ణ  ఇంద్రధనువు

1.మనోజ్ఞమై విలసిల్లు నీ అపూర్వ నృత్యము
రసజ్ఞులను అలరించగ నయనానందకరము
ప్రవర్ధమానమై ఒప్పారు నీ అనన్య నాట్యము
ప్రసిద్ధ నర్తకీమణులకైన అనితర సాధ్యము
అభినవ మయూరమా అభినయ మరాళమా
నీ మేనే నేల దిగిన విద్యుద్ధామము

2.లాస్యబ్రహ్మ నటరాజ ప్రియపుత్రిక నీవే
నాట్య శాస్త్ర భరతమునికి శిశ్యురాలి వీవే
అప్సరసల తలదన్నే హావభావ భంగిమలు
ఆంగిక వాచిక నేత్రాంకిత  నటన ప్రకటనలు
అభినవ మయూరమా అభినయ మరాళమా
నీ గాత్రమే ప్రతి పాత్రకు బ్రాతిపాత్రము

No comments: