Friday, June 19, 2020

రచన,స్వకల్పన&గానం:డా.రాఖీ

నయానాలు తెలిపేను నవరసాల భావనలు
నేత్రాలు పలికేను కొంగ్రొత్త భాషలు
చక్షువులు లిఖించేను మది చదివే ప్రేమలేఖలు
కనుదోయి వెలయించేను కమనీయకావ్యాలు
సర్వేంద్రియాణాం నయనం ప్రధానం
అభినయ నృత్తానికి దృక్కులే ఉత్కృష్టం

1.అంబకాన సంభవించు అశ్రువర్షపాతం
అక్షులే కురిపించు శరశ్చచంద్రాతపం
ఈక్షణమే కలిగించు తీక్షణ శరాఘాతం
లోచనమే ప్రకటించును యోచనసారం
సర్వేంద్రియాణాం నయనం ప్రధానం
 అభినివేశ సాధనమున అవలోకనముచితం

2.హృదయానికి లోకానికి పీతువు సేతువు
జ్ఞానదృష్టి కలుగుటలో అంతర్నేత్రమె హేతువు
కళ్ళలో విరిసేను చెలిని కాంచ హరివిల్లు
ఆహ్లాదవేళ విశ్వంకరాల దరహాస పరవళ్ళు
సర్వేంద్రియాణాం నయనం ప్రధానం
అనుభూతి ఆస్వాదనకై నేత్రం అర్ధనిమీలితం

No comments: