Sunday, July 26, 2020

ఇల్లు చిన్నబోయింది నీవు లేక
వాడ అడుగుతున్నది నీ రాకపోక
నిన్నమొన్న వెళ్ళావేమో సరిహద్దున యుద్ధంకై
యుగాలల్లె తోస్తోంది  పరితపించ హృదయం నీకై

1 దేశాన్ని భద్రంగా కాచే జవాను నీవు
కంటిమీద కునుకు లేక సంరక్షిస్తున్నావు
నెత్తురైన గడ్డకట్టే మంచుకమ్ము లోయలు కొండలు
ఎండవేడినోర్వలేక ఎడారుల్లొ మండును గుండెలు
జాతికె అంకితమాయే నూరేళ్ళ నీజీవితం
చావంటే బెదురే లేదు ప్రాణమే తృణప్రాయం

2.అనుక్షణం క్షేమం కోరుతు నీ తల్లి దీవిస్తోంది
మనసంతా నీవేనిండగ నీకై అర్ధాంగి ప్రార్థిస్తోంది
వందముప్పైకోట్లమంది వెన్నంటి వెంటున్నారు
మడమతిప్పకుండా నీకు మద్దతెంతొ ఇస్తున్నారు
సైనికుడా ధన్యుడవే నీ జన్మ చరితార్థకమవగా
యోధుడా మాన్యుడవే మాతృభూమి ఋణం తీర్చగా

No comments: