Wednesday, April 29, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

(సినిమా కోసం వాడుకోవచ్చు-రచయిత అనుమతితో)

కాటుక మురిసిపోతున్నది
నీ కళ్ళతో జతపడి సార్థకమైనందుకు
తిలకం గర్వమొందుతున్నది
నీ నుదుటన మెరిసిపోతున్నందుకు

ముంగురుల భ్రమరాలే భ్రమిసిపోతున్నాయి
నీ వదన కమలాన్ని ముద్దాడినందుకు
చిరునవ్వుల మల్లియలే ముదమొందుతున్నాయి
నీ పెదవుల నలరించినందుకు

నాదెంత అదృష్టమో నెచ్చెలీ
నీతో సావాసమున్నందుకూ
అనుబంధం పెనవేసినందుకూ

1.పరవశించి పోతున్నది గానము
నువు గాత్ర మాధురిని అద్దుతున్నందుకూ
పలవరించుతున్నది ప్రౌఢ పికము
నీ పాటే మాదిరిగా దిద్దుతున్నందుకూ
నాదెంత అదృష్టమో నెచ్చెలీ
నీతో సావాసమున్నందుకూ
నీ గీత మకరందం గ్రోలుతున్నందుకూ

2.తృప్తిపడుతున్నది భారతీయము
కట్టుబొట్టులో ప్రతీకవే నీవైనందుకూ
చాటిచెప్పుతున్నది మనదైన తెలుగుదనము
సాంప్రదాయ బద్ధమైన నీ నడతకూ
నాదెంత అదృష్టమో నెచ్చెలీ
నీతో సావాసమున్నందుకూ
నూరేళ్ళూ ముడివడి ఉన్నందుకూ

No comments: