అమ్మయాదిలో నీలో(అనంతా చార్యలో) పరకాయప్రవేశం చేసి -డా.రాఖీ
కార్చగలను కడలెడు కన్నీళ్ళైనా
అంగలార్చగలను అమ్మకై ఎన్నేళ్ళైనా
అమ్మను నాకిమ్మను కిమ్మనక ఏదేవుడినైనా
జన్మనే ధారబోసెద అమ్మప్రేగు ముడి కిప్పటికిప్పుడైనా
మరలిరావే ననుగన్న తల్లీ ప్రార్థిస్తున్నా నీకు ప్రణమిల్లీ
మరణాన్నీ తరుణమే జయించీ అజరామరమై జీవించీ
1.కళ్ళలో వత్తులేసుకొని చూసుకొన్నది
కంటికి రెప్పలా ననుకాచు కొన్నాది
అందరిలో ఒక్కడినని అపురూపం చేసింది
నందుడనేనని ఇంటికే యువరాజుగ చూసింది
ఋణముతీర్చుకోలేను ఎన్నిసార్లు పుట్టినా
ఇంత ప్రేమ పొందలేను ఇంకెవరి కడుపునా
మరలిరావే ననుగన్న తల్లీ ప్రార్థిస్తున్నా నీకు ప్రణమిల్లీ
మరణాన్నీ తరుణమే జయించీ అజరామరమై జీవించీ
2.ఆడింది ఆటగ నను గారాబం చేసింది
పాడిందె పాటగా వెన్నుతట్టి మురిసింది
నా కాలున ముల్లు దిగితె అమ్మ కంట చెలిమె ఊట
కాస్తనాకు సుస్తిచేస్తె అమ్మకు శివరాత్రేనట
నా సేవల విలువ ఎంత అమ్మ ఊడిగానికి
నే చూపిన శ్రద్ధ ఎంత అమ్మ ముదిమి తనానికి
మరలిరావే ననుగన్న తల్లీ ప్రార్థిస్తున్నా నీకు ప్రణమిల్లీ
మరణాన్నీ తరుణమే జయించు అజరామరమై జీవించు
No comments:
Post a Comment