రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
శుభోదయం నేస్తమా ప్రియనేస్తమా
నీ నిలువెల్లా సుప్రభాతం ప్రాప్తమా
నిదురలేచు శుభవేళ ఎదురుగా నీ మోమే
అదిరిపాటు చెందేలా నా మోవితొ నీమోవే
శుభోదయం రసోదయం హసోదయం
1.నీలికురుల మబ్బుల మధ్యన
పారాడే పాపిట బిళ్ళనే ప్రత్యూషం
కనుబొమల కనుమల నడుమన
వెలిగే సిందూర తిలకం రవిలా విశేషం
అధరసుధా సాగరాన అలలపై తేలే
నవ్వుల కిరణాలతో హర్షోదయం
శుభోదయం రసోదయం హసోదయం
2.తలకునీళ్ళోసుకుని ఒడుపుగా విదిలిస్తే
నా ఒళ్ళుఒళ్ళంతా తుషారోదయం
కావాలనిలేదంటూ కావలించుకుంటుంటే
పొద్దంతా హద్దులుదాటే పరవశోదయం
మనసెరిగిన ఆలిచేసే చిలిపి అల్లరులే
ఉవ్వెత్తు ఉత్తేజంతో ఉల్లాన ఉల్లాసోదయం
శుభోదయం రసోదయం హసోదయం
No comments:
Post a Comment