రచన,స్వరల్పన&గానం:డా.రాఖీ
రాగం:సారమతి
హరి వేంకట నారాయణా
సిరివల్లభా కమలనాభా
కరుణాభరణా దీనావనా
పరిపరి విధములుగా నిను నుతియింతును
మరిమరి నీ చరణములే నే శరణందును
1. కరినైనా కానైతిని సరగున నను బ్రోవగా
బలినైనా అవకపోతిని నీపదమే తలనిడగా
రాయిగా పడివున్నా తాకాలని నీ అడుగు
వెదురునై ఒదిగున్నా చేరాలని నీ మోవి
పరిపరి విధములుగా నిను నే కోరెదను
త్వరపడి నీ పదములనే నేనిక చేరెదను
2.నీ గుడి గంటనై నిన్నంటెద సవ్వడిగా
అఖండ దీపమునై వెలిగెద గర్భగుడిన
తులసీదళ మాలనై అలరింతును నీ మెడన
చక్కెర పొంగళినేనై స్థిరపడెదను నీ కడుపున
పరిపరి విధములుగా చేసెద నీ సేవలు
నీ సన్నిధిలో మనుటకు ఎన్నెన్ని స్వామి త్రోవలు
No comments:
Post a Comment