నా గుండె తూనికరాయి-నీపై ప్రేమకొలవడానికి
నా మనసు కలికితురాయి-నీ పాపిట నిలవడానికి
తెలపడానికి సరిపోదు-నాకున్న భాషాజ్ఞానం
దేవి ఎడల భక్తునికుండే-భవ్యమౌ ఆరాధనభావం
హృదయగతమైనది మన బంధం
కేవలం మనచిత్తానికె అనుభవైకవేద్యం
1.లాలనకు అమ్మగా-ఆలనకు నాన్నగా
పాలనకు ప్రియసఖిగా-ఆత్మీయ బంధువుగా
సృష్టిలో ఏబంధం పోల్చనట్టుగా
ఇలలోన బంధాలన్నీ సరిపోనట్టుగా
ఎదలోన ఎదగా ఒదిగినట్లుగా
మదిలోన తలపే మొలిచినట్టుగా
హృదయగతమైనది మన బంధం
కేవలం మనచిత్తానికె అనుభవైకవేద్యం
2.కెరటానికి మేఘానికి ఉన్న సంబంధం
స్రవంతికి సాగరానికి మధ్య అనుబంధం
దిగదుడుపే లోకంలో ఏ రక్తసంబంధం
తీసికట్టే గణుతిస్తే ప్రతీ అనురాగ బంధం
నీలోకి నీవే తొంగిచూడు ఒకసారి
అవగతమౌతాను నేనే నీవుగా మారి
హృదయగతమైనది మన బంధం
కేవలం మనచిత్తానికె అనుభవైకవేద్యం
No comments:
Post a Comment