చంద్రకాంతి అందం చకోరిలా గ్రోలనా
మేఘమాల సౌందర్యం చిరుగాలినై స్పృశించనా
ఇంద్ర ధనుసు సొగసు గని కేరింతలేయనా
జలపాత సోయగాన్ని చకితుడనై తిలకించనా
ప్రకృతినీ పడతినీ ఆరాధించనిదెవ్వరు
పరాశక్తిరూపం గాంచి పరవశించనిదెవ్వరు
1.తరువుకున్న త్యాగగుణం ప్రశంసార్హమే
నదికి కలిగిన దాతృత్వం అభినందనీయమే
పొడిచే తొలిపొద్దు అరుణిమ అభినుతించదగినదే
మలిసంజె వెలుగుల రంగులుపొంగే నింగిఎంచదగ్గదే
ప్రకృతినీ పడతినీ ఆరాధించనిదెవ్వరు
పరాశక్తిరూపం గాంచి పరవశించనిదెవ్వరు
2.శిఖరాలు లోయలు పచ్చని పచ్చికబయళ్ళు
హిమానీనదాలు నురగలెత్తు సాగర కెరటాలు
మారే ఋతువుల విరిసే పలువన్నెల సుమశోభలు
రోదసిలో అబ్బురపరచే అనంత కోటి తారకలు
ప్రకృతినీ పడతినీ ఆరాధించనిదెవ్వరు
పరాశక్తిరూపం గాంచి పరవశించనిదెవ్వరు
No comments:
Post a Comment