అరువు తెచ్చుకున్న ప్రతి అందం
ఔతుందా ఎపుడైనా నీ సొంతం
సొంతమొహం చూపలేని వింత తత్వం
జలతారు ముసుగేసి చూపే యత్నం
నువ్వు నువ్వుగా ఉంటేనే ఔచిత్యం
లోపలొకటి బయటొకటి ఎందుకీ అగత్యం
1.దొరికినదల్లా నీదికాదన్నదే పరమార్థం
తేరగ ప్రాప్తించినదైనా మనదేయను స్వార్థం
ఉచితంగా పొందినా పరులకు పంచలేని నైజం
అయాచితంగ వచ్చినా హక్కుగ ఎంచడమే చిత్రం
నువ్వు నువ్వుగా ఉంటేనే ఔచిత్యం
లోపలొకటి బయటొకటి ఎందుకీ అగత్యం
2.నీకున్నవన్నీ పునీతమౌ శృంగార భావనలు
ఎదుటి వారివేమో మదమెక్కిన రసికతలు
మహిళవై రతికేళి ప్రస్తావన నీదైతే సాహసం
పురుష కవుల సౌందర్య ఉపాసనేమొ పరిహాసం
నువ్వు నువ్వుగా ఉంటేనే ఔచిత్యం
లోపలొకటి బయటొకటి ఎందుకీ అగత్యం
No comments:
Post a Comment