శ్రీశ్రీనివాసం శ్రితపారిజాతం
మా ప్రణతులివే గైకొనుమా సతతం
పద్మావతి అలమేలు మంగా సహితం
చేకూర్చర సర్వదా మహి మహితహితం
గోవింద గోవింద పాహి ముకుందా
నారాయణ వాసుదేవ రమానందా పరమానందా
1.కట్లుబాట్లు మాకుంటే భరించుకోలేము
మా స్వేఛ్ఛను హరిస్తే సహించగాలేము
ఆంక్షలన్నవెపుడు మాకు ఆకాంక్షలు కాబోవు
విచ్చలవిడి బ్రతుకె మాకు సంబరాల తావు
ఐనా సరె మమ్ములను నీవె ఆదుకోవాలి
కరోనా బారిబడితె నీవే చేదుకోవాలి॥గోవిందా॥
2.గాలిలోన దీపముంచి నీ ఉనికిని ప్రశ్నిస్తాం
చేతులైన కాపుంచక నీ మహిమను ఆశిస్తాం
చిత్తశుద్ది మావద్ద ఎంత మాత్రమూ లేదు
దైవభక్తి అంటేనే మామనసుకు కడుచేదు
మాపని ఏదైనా నీ పని మము సాంతం కావడమే
నీవిక చక్రం సంధిస్తే కరోనా అంతం కావడమే॥గోవిందా॥
No comments:
Post a Comment