రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
కాస్తంత తోడొస్తావా-కలలోకి వెళుతున్నా
నీచేయినందిస్తావా-తలమునకలౌతున్నా
కవితలకు వీలౌతుంది-కవి తలకు మేలౌతుంది
విహరించు మిషతోనే హరించవే నాఎదను
మొహరించు వేళలో భరించవే నా సొదను
1.నీ చూపుల శరాలనే మారుస్తా అక్షరాలుగా
నీ పదాల గురుతులనే పేరుస్తా పదాలుగా
నీ మంజుల దరహాసాన్నే వాక్యాల్లో కుమ్మరిస్తా
నీ గాత్ర పరిమళాన్నే గీతమంత పరిచేస్తా
విహరించు మిషతోనే హరించవే నాఎదను
మొహరించు వేళలో భరించవే నా సొదను
2.నీ స్పర్శలోని హాయిని రాగమందు రంగరిస్తా
నీ గుండె సవ్వడిని పాటకు తగు లయచేస్తా
కలిగే గిలిగింతలన్నీ గమకాలు పలికిస్తా
మిగిలే అనుభూతులన్నీ కృతిగా నేనాలపిస్తా
విహరించు మిషతోనే హరించవే నాఎదను
మొహరించు వేళలో భరించవే నా సొదను
No comments:
Post a Comment