రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
ఎవరైనా ఎపుడైనా తాకారా మీ ఎదను
ఏదైనా ఘటనొకటి తట్టిందా మీగుండెను
అప్రయత్నంగానే నయనాలు సజలాలై
పొడిబారిన హృదయంలో ఊట ఒకటి మొదలై
నిదురించిన నీలో మనిషి మేలుకొన్న అనుభూతి
అడుగు పొరల మరుగున అదిగో మానవత్వ ఆచూకి
1.కాసింత సమయమైనా వెచ్చించగలిగి నప్పుడు
పిసరంత సాయమైనా పరులకు నువు చేసినప్పుడు
ఎదుటివారి కన్నుల్లో కనిపించే సంతృప్తి చిహ్నం
కృతజ్ఞతా భావనతో గొంతు మూగవోయిన వైనం
నిదురించిన నీలో మనిషి మేలుకొన్న అనుభూతి
అడుగు పొరల మరుగున అదిగో మానవత్వ ఆచూకి
2.గోరంత నీ త్యాగం ఆర్తులకు కొండగా పరిణామం
పట్టెడంత పెట్టిన అన్నం తరతరాలకది ఆశీర్వచనం
ఆస్తులను పంచకున్నా దాతృత్వగుణమే సుకృతం
సహానుభూతి చెందితె చాలు ఎదుటి మనసు కదియే ఊతం
నిదురించిన నీలో మనిషి మేలుకొన్న అనుభూతి
అడుగు పొరల మరుగున అదిగో మానవత్వ ఆచూకి
No comments:
Post a Comment