Friday, October 28, 2022

*ఇది నా 3000 వ గీతం🌹😊💐🙏*


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:శివరంజని


పల్లవి: 

వీణా నిక్వణ మాధురి ఆహ్లాదమే

గమనింతురా తెగిన వ్రేలికొసల గాయాలు

వేణువాద్య వాదన మెంతో హృద్యమే

ఎరుగుదురా ఎవరైనా ఊపిరితిత్తుల ఆర్తనాదాలు

నవ్వులు పూసే పెదవుల మాటున

హృదయ విదారాలు

మెరిసే కన్నుల వెనకగ దాగిన

అశ్రు సాగరాలు…


చ.1.కమ్మని కవితల కావ్యపఠన కమనీయమే

అనుభూతుల ప్రసవవేదన అనుభవ గ్రాహ్యమే

ఇంపగు దృశ్యపు వర్ణచిత్రాలు రమణీయమే

ఊహకు రూపకల్పనలోని సృజనా అనూహ్యమే

నవ్వులు పూసే పెదవుల మాటున

హృదయ విదారాలు

మెరిసే కన్నుల వెనకగ దాగిన

అశ్రు సాగరాలు…


చ.2.ఎలుగెత్తి ఆలపించే గానం శ్రవణానందమే

స్వరతంత్రులు పెగిలించగా రేగే యాతన విదితమే

హావభావ విన్యాసాల నాట్యం నయనానందమే

ధరణి తాడనతొ పదముల పీడన వ్యధాబరితమే

నవ్వులు పూసే పెదవుల మాటున

హృదయ విదారాలు

మెరిసే కన్నుల వెనకగ దాగిన

అశ్రు సాగరాలు…


*ఇది నా 3000 వ గీతం🌹😊💐🙏*

No comments: