Friday, October 7, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


శ్రీధరా శ్రీకరా శ్రీనాథా

శ్రీహరి శ్రీపతి శ్రీవేంకటాచలపతి

సంకటముల కంటకములు 

నిను చేరే బాట పొడుగునా

ఆటంకములు అగచాట్లు 

తగునా నాకడుగు అడుగునా

పాహిమాం పాహిమాం పరంధామా

రక్షమాం రక్షమాం తిరుమల సార్వభౌమా


1.నీ సంకల్పము ఎరుగుట బ్రహ్మతరమా

నీవిచ్చే కర్మఫలము తెలియగ శివుని వశమా

లీలాలోలా శ్రితజనపాలా కథలో ఇన్ని మలుపులా

ఆపద్భాంధవా అనాథనాథా పథమంతా గతుకులా

పాహిమాం పాహిమాం పరంధామా

రక్షమాం రక్షమాం తిరుమల సార్వభౌమా


2.అల్లంత దూరానా  అగుపించును గమ్యము

చెంతకు చేరినంత ఎండమావితో సామ్యము

ఆశానిరాశల నడుమన  నాదెంతటి దైన్యము

నువు వినా అన్యమెవరు స్వామీ నీవే శరణ్యము

పాహిమాం పాహిమాం పరంధామా

రక్షమాం రక్షమాం తిరుమల సార్వభౌమా

No comments: