Thursday, September 17, 2015


https://youtu.be/zR-oyHHOAYU

ఓ సుముఖా- వినాయకా- శుభదాయకా
రావయ్యా –మాయింటికి-ఎలుక నెక్కి చకచకా
ఇల్లెడింటి వారమంత- స్వాగతిస్తు వేచినాము
కాసింత చూపవయ్యా-మా పైన కనికరము

1.    బంతులు చామంతులు-దారంతా పరిచినాము
మామిడాకు తోరణాలు-ద్వారాలకు కట్టినాము
ఇరవయొక్క పత్రాలు-సేకరించి పెట్టినాము
నువుమేచ్చే మందారాల –మాల గుచ్చి ఉంచినాము

పూజలందుకోవయ్యా- ఓ గణపయ్యా
విన్నపాలు దీర్చవయ్య-ఓ వెంకయ్యా

2.    ముదముతోడ మోదకాలు- ఆరగించవయ్యా
ప్రియమారగ ఉండ్రాళ్ళు –బొజ్జనింపుకోవయ్యా
తనివిదీర పాయసాన్ని-కడుపార గ్రోలవయ్య                                  
వండి వార్చి ఉంచినాము-దండిగ భుజియించవయ్య

నివేదనలు నీకివే లంబోదర లకుమికరా
వేదనలను తొలగించర   పాశాంకుశ ధరా
www.4shared.com/mp3/vCsn0Tbgba/O_SUMUKHA_VINAYAKA.html?
https://youtu.be/zR-oyHHOAYU




Monday, August 3, 2015

https://youtu.be/L_xDG_BEHPk

పల్లవి:       మనలేను ప్రభూ
               నిమిషమైన నిన్ను గనక
               ఏమనలేను ప్రభూ
               అంతా నీ మాయ గనుక

అనుపల్లవి: నీ దృక్కులు ప్రసరించు
              నీ దయ కురిపించు
              చేయిపట్టి నడిపించు
              కడదాకా విశ్వ జనక

చరణం:1)   అందాలను చూపెట్టి
              బంధాలలొ పడగొట్టి
              తాయిలాలు ఆశపెట్టి  
              కావాలని పట్టుబట్టి
 
             లోకమనే మైకంలో   
             నిర్దయగా నను నెట్టి
             చోద్యమింక చూతువేల
             ఓ జగజ్జెట్టి....

చరణం:2) నిను చదువగ వేరే
            బడికేగుట అవసరమా
            నినునిలుపగ ఎదలో
            గుడికేగుట సంబరమా

            సూత్రధారి వీవని
            పాత్రధారి నేనని
            మర్మమెరుగునoతలోనే   
            మరల మరపు చెరలొ బడితి

Saturday, April 11, 2015

౹౹భారతీయ జనతా పార్టీ॥

భారతీయ జనతా పార్టీ
జగతిలోన దీనికేది లేనెలేదు సాటి
విలువలు కలిగిన విలువైన పార్టీ
భారతీయ ధర్మానికి వెన్నుదన్నైన పార్టి౹౹భారతీయ జనతా పార్టీ॥

1.హైందవ తత్వాన్ని ఆకళింపు చేసుకొంది
సాంప్రదాయ సంస్కృతులను చంకనెత్తుకొన్నది
భరతమాత కీర్తి దిశల చాటిచెప్పుతున్నది
భరతఖ్యాతి తరతరాల ఇనుమడింపజేస్తన్నది౹౹భారతీయ జనతా పార్టీ॥

2.సంఘపరివార్ తో సఖ్యత కలిగున్నది
లౌకికవాదానికీ రాచబాట వేస్తున్నది
బడుగు బలహీనుల మన్ననలనుగొన్నది
ప్రపంచాన అతిపెద్ద పార్టీగా బలపడ్డది౹౹భారతీయ జనతా పార్టీ॥

3.సకలజనుల సుఖశాంతులె ఏకైక సిధ్ధాంతము
జాతీయ పరిరక్షణ తన వాదము
సనాతన అధునాతన మేళనమే సూత్రము
నీతి సహిత పాలన రామరాజ్యస్థాపనే ధ్యేయము౹౹భారతీయ జనతా పార్టీ॥

4.వాజ్పేయి సారథిగా వన్నెలద్దుకొన్నది
కాషాయ వర్ణంతో కదంతొక్కుతున్నది
కమలమే చిహ్నమై కాంతులీనుతున్నది
మన మోడీ ఒరవడితో వాడి పెంచుకున్నది
వాసికెక్కుతున్నది౹౹భారతీయ జనతా పార్టీ॥

Monday, February 9, 2015

జానపదమా నీకు నీరాజనం

జానపదమా నీకు నీరాజనం
పల్లె పదమా పాదాభి వందనం
అలుపెరుగని శ్రమకు నీవు ఆలంబన
మమేకమయే కృషికి నీవేలే ఆసరా

1)మైమరపే శృతినీకు
ఏకాగ్రతె లయ నీకు
ఉరిమే ఉత్సాహమే
సంగీతము నీ పథముకు
అనుభవాలు అనుభూతులు
నీ సాహితి సొబగులు
కలలూ ఊహలూ
నీ గీతికి వస్తువులు||జానపదమా||

2) చేతిలోని పనిముట్లే
దరువుకు ఆదరువులు
పెదవులపై ఉల్లాసపు
ఈలలే వేణువులు
వంతపాడు గొంతులే
నీకు వాద్య బృందాలు
ఆశువుగా పుట్టిన శిశువా
నీ తోబుట్టులె ఆనందాలు||జానపదమా||

Monday, September 22, 2014

భారత మాత – భాగ్య విధాత


భారత మాత భాగ్య విధాత


||రాఖీ||భారత మాత – భాగ్య విధాత

మముగన్న మా తల్లి –జన కల్పవల్లి
మా భరత మాత-సౌభాగ్యధాత
భారత మాతా –భాగ్య విధాతా

1. అసోం నుండి గుజరాత్ వరకు
  కాశ్మీరాదిగ కన్యాకుమారికీ
విలసిల్లు దేశమా నీకు మా వందనం
మా మాతృదేశమా పాదాభి వందనం

2. మహిమోన్నత హిమాలయాలు
పావన గంగా యమునా నదులు
అలరారు దేశమా నీకు మా వందనం
మా మాతృదేశమా పాదాభి వందనం

3. మూడు దిశలలో కడలి జలాలు
తనువున వనములు మైదానములు
రాజిల్లు దేశమా నీకు మా వందనం
మా మాతృదేశమా పాదాభి వందనం

4. ఉగ్గుపాలతో వీర గాధలు
చిన్న నాటనే జ్ఞాన బోధలు
నూరిపోసినా జననీ నీకు మా వందనం
మా మాతృదేశమా పాదాభి వందనం

5. భిన్నత్వం లో నిజ ఏకత్వం
జగమే మెచ్చే లౌకిక తత్వం
చారిత్రిక దేశమా నీకు మా వందనం
మా మాతృదేశమా పాదాభి వందనం

http://www.4shared.com/mp3/7ls4_Fl0ba/MAMUGANNA_MAA_TALLI.html


Saturday, August 2, 2014

ఓ అర్ధాంగీ

తిరిగే గానుగలో నలిగే చెరుకు గడవో
మరిగే పాలమీద కట్టిన మీగడవో
ఓ అర్ధాంగీ ..,నిన్నర్ధం చేసుకొనగ నా తరమా
ఓ సంపంగీ ..నినువీడి క్షణమైన మనగలనా

1. పనితో అలసినా-చెరగదు చిరునవ్వు
నలతగ నీకున్నా –నలగదు నీ మోముపువ్వు
శిరోవేదనే నరక యాతనౌతున్నా
మనోవేదనే గుండెను మెలిపెడుతున్నా
తబడదెప్పుడూ నీ అడుగు
కనబడ దెప్పుడునీ కన్నీటి మడుగు

ఓ అర్ధాంగీ ..,నిన్నర్ధం చేసుకొనగ నా తరమా
ఓ సంపంగీ ..నినువీడి క్షణమైన మనగలనా

2. ఆశలు ఆదిలోనె-అణగారిపోతున్నా
ఊహలు తృటిలోనె-చేజారిపోతున్నా
కాదెప్పుడు బ్రతుకు నీకు ప్రశ్నార్థకం
ఇల్లాలిగ నీపాత్ర అయ్యింది సార్థకం
బంధువర్గాన నీకు-అభినందన చందనాలు
మిత్రబృందాన నీకు-అభిమాన బంధనాలు

ఓ అర్ధాంగీ ..,నిన్నర్ధం చేసుకొనగ నా తరమా
ఓ సంపంగీ ..నినువీడి క్షణమైన మనగలనా

తెలంగాణ- నింగిలోన ఎగురుతున్న నవ కేతనమా..


మరల మరల మరపు రాని అనుభూతుల పునఃశ్చరణ ...!
తెలంగాణ షహీద్ ల త్యాగాల సంస్మరణ...!!
“తెలంగాణ(ఆవిర్)భావ గీతం “రాఖీ -02-06-2014

నింగిలోన ఎగురుతున్న నవ కేతనమా..ఓ జయ కేతనమా..!!
తెలంగాణ జనుల స్వప్న సాకార చిహ్నమా...
ఉద్యమాల గర్భాన ఊపిరులూని
(పునర్) ఉద్భవి౦చినావమ్మా తెలంగాణ రాష్ట్రమా
“జయహో జయహో జయ తెలంగాణమా
స్వేఛ్చా స్వాభిమాన సకల జనుల ప్రాణమా”

1. నీదైన నాగరికత నీదైన భావుకత
నీ సంస్కృతి నీ సభ్యత నీదైన నడత
తెలంగాణ పేరులోనే ఒళ్ళంతా పులకరింత
తెలంగాణ తలపులోనే కన్నుల చెమరింత
“జయహో జయహో జయ తెలంగాణమా
స్వేఛ్చా స్వాభిమాన సకల జనుల ప్రాణమా”

2. శాతవాహన కాకతీయ సామ్రాజ్య వైభవమా
కులీకుత్బ్ షాహి వంశ గోల్కొండ ప్రాభవమా
గుండె చార్మినార్ నీకు అండ కాకతీ ద్వారము
నిండుగ వెలుగొందు తల్లి కొలుతుము ప్రణమిల్లి
“జయహో జయహో జయ తెలంగాణమా
స్వేఛ్చా స్వాభిమాన సకల జనుల ప్రాణమా”

3. కంటి ఊటలాగిపోయి- పంట కాల్వ పారాలి
“ఆకలే “ చల్లార్చే -నూకలే పండాలి
బడుగులంత బంగారు బతుకమ్మ లాడాలి
ఆ’కలే ‘ నెరవేర్చే రూకలే నిండాలి..
“జయహో జయహో జయ తెలంగాణమా
స్వేఛ్చా స్వాభిమాన సకల జనుల ప్రాణమా”

4. బలిదానాలు నీకు పరిపాటే అనాదిగా
పునరుజ్జీవనమే చేసుకో పునాదిగా
చేయి చేయి కలుపుతూ గెలుపు తలుపు తట్టాలి
తెలంగాణ ఖ్యాతిగని హారతులే
పట్టాలి ...జగతి జేజేలు కొట్టాలి...

“జయహో జయహో జయ తెలంగాణమా
స్వేఛ్చా స్వాభిమాన సకల జనుల ప్రాణమా”
http://www.4shared.com/mp3/WPnWwuM7ce/RAKI-JAYAHO_TELANGANAMA.html

మైత్రీ బంధము



03-08-2014-మైత్రీ దినోత్సవ శుభాభినందనలతో...రాఖీ-9849693324.

మైత్రీ బంధము -మానవతకె అందము
ఒకరికొరకు ఒకరైన చందము
ప్రతి జ్ఞాపకం ప్రతి అనుభవం పరమానందము

1.   రాముడు సుగ్రీవుడు రాచబాట వేసినారు
కృష్ణుడూ కుచేలుడూ అంతరాలు మరచినారు
సుయోధనుడు కర్ణుడు ఒకే ఆత్మ అయినారు
స్నేహితమే మహితమని చరితార్థులైనారు

2.   తెలిసీ తెలియని పసితనాన  సోపతి
ఎదిగే వయసులోన ఎల్లలెరుగనీ చెలిమి
బాంధవ్యాల కన్న మిన్న యైనదే స్నేహము
వేదనలో మోదములో స్మృతి మెదులును నేస్తము

3.   ఆర్థిక గణాంకాలు కొలవలేని పెన్నిధి
జాతిప్రాంత కులమతాల కతీతమీ సన్నిధి
రూపురేఖ లెంచనీ విలువైన దోస్తీ ఇది
ఎంతమంది ఎక్కినా మునగని షిప్పిది - ప్రెండ్ షిప్ ఇది

Ok