Wednesday, April 29, 2009

“గంధర్వుడు దిగి వస్తాడని-ఘంటసాల ఉదయిస్తాడని”

నా భావాలకు జీవం పోసే-నా గీతాలను గానం చేసే “గంధర్వుడు దిగి వస్తాడని-ఘంటసాల ఉదయిస్తాడని”
 ఎదిరి చూస్తున్నాను-నిదుర కాస్తున్నాను

 1. ప్రేమ తెమ్మెరే స్పృశియిస్తుంటే- ప్రేమ నగరునే స్మృతి తెస్తుంటే ఒలికిన పలుకులు అనురాగంగా తలపించే ఎద స్పందనయే నవరాగంగా వినిపించే 
 “గంధర్వుడు దిగి వస్తాడని-ఘంటసాల ఉదయిస్తాడని” ఊహలు చేస్తున్నాను-ఊసులు దాస్తున్నాను 

 2. నా రోదన గొంతుదాటి రాలేకుంటే- ఆవేదన నా కలమే కక్కేస్తుంటే జీవన తిమిరాలే సమూలంగ తొలగించే బాధల కుహరాలే ప్రకాశంగ వెలిగించే “గంధర్వుడు దిగి వస్తాడని-ఘంటసాల ఉదయిస్తాడని” కలలు కంటున్నాను-కలవరిస్తున్నాను 

 3. ఘరానా నాయకులే దేశాన్ని దోచుతుంటె- దగా పడిన తమ్ములంత దిగాలుపడి పోతుంటే వెన్నుతట్టి పదలెమ్మని ముందుకు నడిపించే గళమెత్తీ జనజాగృతి గీతాన్నే ఆలపించె “గంధర్వుడు దిగి వస్తాడని-ఘంటసాల ఉదయిస్తాడని” పాటలు రాస్తున్నాను-బాటలు వేస్తున్నాను 
 
4. గుండెలోయలోనుండి భక్తి పొంగి పోతుంటె వేంకటేశు తలపులతో మేనుమరచి పోతుంటే అక్షరాల హారతులే స్వామికి అందించే పదముల సుమమాలికలే ప్రభువుకు అర్పించే “గంధర్వుడు దిగి వస్తాడని-ఘంటసాల ఉదయిస్తాడని” కీర్తన రాస్తున్నాను-ఆర్తిగ చూస్తున్నాను

No comments: