Wednesday, November 25, 2009


https://youtu.be/HDuusk2D2ఫస్ట్

శరణాగత వత్సలా-హే భక్త వత్సల
కలియుగ వరద-కరుణాభరణ
వేంకట రమణ-తిరుపతి వేంకట రమణ-తిరుమల వేంకట రమణ

1. కొండలు ఏడు ఎక్కేటప్పుడు
మా గుండెలు నిను వేడు- దిక్కే నీవెపుడు
బండబారిన మా బ్రతుకులలో
అండగ నీవుండి మము నడిపించు

2. బంగారు శిఖరాల నీ ఆలయం
సింగార మొలికించు నీ సొయగం
కనులార దర్శించు ఆ సమయం
మా జీవితానికి రసమయం

3. శ్రీనివాసుడవు నీవైతె చాలదు
హృదయాన బంధిస్తె సిరి మాకు దొరకదు
మా యింటివాడవై వీడని తోడువై
మాకంటి జ్యోతివై నీవుండిపో


వేసినాము మెడలోన స్వామి నీ మాల
పాటించగ సాయమీయి నిష్ఠగ నేమాల
ఎరుగనైతిమయ్యప్పా మాయా మర్మాల
కలనైనా వల్లింతుము స్వామి నీ నామాల

1. కఠినతరము స్వామి ఈ మండల దీక్ష
పెట్టబోకు అయ్యప్పా మాకే పరీక్ష
సడలని సంకల్పమే శ్రీరామ రక్ష
తెలియక మే తప్పుజేస్తె వేయకు ఏ శిక్ష

2. ఏనాడు చేసామో కాసింత పుణ్యం
దొరికింది నీ పాదం మా జన్మ ధన్యం
చూపినావు దయామయా మాపై కారుణ్యం
జన్మజన్మలకైనా నీవె మాకు శరణ్యం

3. అందుకో అయ్యప్ప మా ప్రణామాల
చేకొను మణికంఠా మా హృదయ కుసుమాల
మహిమల శబరిమల కలిగించు క్షేమాల
జరగనీయి జీవాత్మ పరమాత్మ సంగమాల

షిర్డీ సాయే శేష శాయి
ద్వారకమాయే వైకుంఠమోయి
విభూతియే ఐశ్వర్యలక్ష్మీ మాయే
భక్తజన సందోహమె పాలసంద్రమాయే

1. శ్రద్ధ-ఓరిమిలు శంఖ చక్రాలు
బాబా చిరునవ్వులె వికసిత పద్మాలు
చేతిలో చిమ్టాయే మదమదిమే గద
చిరుగుల కఫ్నీయే పీతాంబరము కద

2. ఊరేగే పల్లకే గరుడ వాహనం
సాయిరూపమే నయన మోహనం
సాయి లీలలే మహిమాన్విత గాధలు
సాయి పదములే పరసాధకమ్ములు

Saturday, November 21, 2009

ఎందుకయా నామీద నీకు ఇంత దయ
నే చేసిన సత్కర్మ ఒకటైన గుర్తే లేదయ
పరమదయాళ ఈ నా సంపద నీదయ
నిన్నేమని పొగడను హే దయామృత హృదయ

1. ఏ నోము నోచిందని కోకిల కిచ్చావు తేనెల పాట
ఏ వ్రతము చేసిందని నెమలికి ఇచ్చావు చక్కని ఆట
ఏ రీతి మెప్పించెనో మల్లెలకిచ్చావు మధుర సువాసన
ఏ మని ఒప్పించెనో మామిడికిచ్చావు కమ్మని రసన

దయా గుణమే నీలో ఉన్నదయా
మాగొప్పతనమేమి కానే కాదయా

2. నోరార పిలిచిందనా మానిని బ్రోచావు మానము సంరక్షించి
ఎలుగెత్తి అరిచిందనా కరిని కాచావు మకరిని సంహరించి
అనుక్షణము తలచాడనా వెలిసావు ప్రహ్లాదునికై స్తంభాన
శరణంటు పాడిందనా నిలిచావు మీరా హృదయాన

దయా గుణమే నీలో ఉన్నదయా
మాగొప్పతనమేమి కానే కాదయా

Friday, November 20, 2009

విధి శాపగ్రస్తుడా! తమ్ముడా!!
ఆ జన్మ ఋణగ్రస్తుడా
గ్రామీణ బ్యాంకుకే కట్టుబానిస నీవు
నామ మాత్రపు జీతం-వెట్టిచాకిరి జీవితం
1. నీ ముద్దుపేరు స్వల్ప వ్యవధి పనివాడు
సమయాసమయాలు లేవు నీకేనాడు
సూర్యుడితో బ్యాంకు కొచ్చి చంద్రుడితో వెళతావు
ఏ సెలవులు పనివేళలు నీకసలు వర్తించవు
2. సిబ్బంది తలలోన నాలుక వైపోతావు
తెఱమరుగున నీవే ఏలిక వైపోతావు
మేనేజర్ కన్నువు-ఫీల్డాఫీసర్ కాలువు
అక్కౌంటెంటు క్యాషియర్ల అంగాంగమేనీవు
3. అన్నా తమ్మీ మావా బావా వరసలు నీవైతావు
ఖాతాదారులందరికీ ఆత్మ బంధువౌతావు
వ్యక్తిగత శ్రద్ధ చూపు వ్యక్తిత్వమే నీది
విశ్వసనీయతకే పెట్టిన పేరు నీది
4. ఏ పట్టాలేని పట్టభద్రునివి నీవు
ఏ శిక్షణ పొందని నైపుణ్య వంతుడవు
నువు చేయని పని ఏది మోయని భారమేది
గుర్తింపే లేదు గాని బహుముఖ ప్రజ్ఞాశాలివి
5. పేస్కేళ్ళు ఎదిగాయి డిఏ లు పెరిగాయి
వెతలు వేతనాలు నీవి మారకున్నాయి
ఉద్యోగ భద్రత ఎండమావే నీకెపుడు
క్రమబద్ధీకరణ నీ తీరని కల ఎపుడు
6. మోములోన చిరునవ్వు చెఱగనీయవు
తిట్లైనా దీవెనలని తలపోస్తావు
ఎదుటివారు ఎవరైనా సమాధాన పరుస్తావు
గ్రామీణ భారతంలొ అభినవ అభిమన్యుడవు
7. ఎంత కీర్తించినా నీసేవకు అది తక్కువె
ఎంత చెల్లించినా నీశ్రమకది తూగదే
దగాపడిన తమ్ముడా నిజమైన త్యాగ ధనుడ
జోహారు నీకిదే ఓ కారణ జన్ముడా,!!! ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,రచన:రాఖీ-9849693324.

Wednesday, November 18, 2009

https://youtu.be/f575y8F8nUs

నాదానివై భాసిల్లు
ఓంకార నాదానివై భాసిల్లు బాసరమాతా
నా స్వరపేటి అనునాదానివై రాజిల్లు
వేదానివై విలసిల్లు
నామది చదివేదానివై విలసిల్లు విశ్వమాతా
నా గళసీమ నిక్వాణివై విరాజిల్లు

1. నా భాషణమున మకరందానివై
నా జీవనమున సుమగంధానివై
నాహృదయమున సదానందానివై
పదపదమున ప్రభల ప్రబంధానివై
ప్రభవించవే ప్రణవదేవీ
ప్రణతులందవే వాగ్దేవీ

2. సుతి తప్పనీయకు నా ఏ గీతి
గతి వీడనీయకు నా అభినుతి
మతి మరవనీయకు ఏ సంగతి
సద్గతి సాగనీయవె జ్ఞానద్యుతి
భారమికనీదే హే భారతీ
ప్రగతి నాకీవె బ్రహ్మసతి

Sunday, November 15, 2009

OK

స్త్రీ నిత్యకృత్యాలే నృత్యరీతులు
నారీమణి నడకలే నాట్య శాస్త్రాలు 
అంగన భంగిమలే రంగరంగ వైభవాలు 
నితంబినీ కదలికలే చకిత దివ్య విలాసాలు 

కల్లాపిచల్లితే – రంగవల్లి దిద్దితే 
తులసికోట చుట్టూ బిరబిరా తిరిగితే 
కురులార బెట్టితే-వాల్జెడనే అల్లితే 
మల్లెపూలమాల గట్టి కొప్పులోన తుఱిమితే 
అంగన భంగిమలే రంగరంగ వైభవాలు 
నితంబినీ కదలికలే చకిత దివ్య విలాసాలు 

పాలను పితికితే-పెరుగును చిలికితే 
తలపైనాకటిలోనా బిందెలతో నీళ్ళు తెస్తె 
రోకటి పోటేస్తే-చాటతొ చెరిగేస్తే 
ఒళ్ళంతా ఊయలవగ జల్లెడతో జల్లిస్తే 
అంగన భంగిమలే రంగరంగ వైభవాలు 
నితంబినీ కదలికలే చకిత దివ్య విలాసాలు 
 
వడివడిగా వండితే –వయ్యారంగ వడ్డిస్తే 
కడుపారగ కొసరి కొసరి విందారగింపజేస్తె 
తాంబూలం చుట్టితే- అంగుళితోనోటికిస్తె 
కొఱకబోవు అంగుటాన్ని కొంటెగా తప్పిస్తే 
అంగన భంగిమలే రంగరంగ వైభవాలు 
నితంబినీ కదలికలే చకిత దివ్య విలాసాలు 
 
మేని విరుపులు-మూతి విసరులు 
సిగ్గుతో నేలమీది బొటనవ్రేలు రాతలు 
కంటి భాషలు-మునిపంటినొక్కులు 
కడకొంగును వ్రేలిచుట్టుచుట్టుకొలతలు 
అంగన భంగిమలే రంగరంగ వైభవాలు 
నితంబినీ కదలికలే చకిత దివ్య విలాసాలు 

దుప్పటి మారిస్తే-శయ్యను సవరిస్తే 
చేయిపట్టి చేరదీయ చిలిపిగ వదిలించుకొంటె 
పాలను అందిస్తే-మురిపాలను చిందిస్తే 
అర్ధనారీశ్వరాన కైవల్య గతిసాగితె 
అంగన భంగిమలే రంగరంగ వైవిభవాలు 
నితంబినీ కదలికలే చకిత దివ్య లాసాలు 

అతిథుల ఆహ్వానం అపర కూచిపూడి
పండగ సందడిలో అభినవ కథాకళి 
భామిని చైతన్యం అమోఘ భరతనాట్యం 
రమణి రూపులో అభినయ నటరాజే ప్రత్యక్షం 
అంగన భంగిమలే రంగరంగ వైభవాలు 
నితంబినీ కదలికలే చకిత దివ్య విలాసాలు 

Friday, November 13, 2009

'మా తా’పాలకే పరితపించి పోతున్నా
'నీ రూ’పాలకే నే చిక్కిపోతున్నా
గుక్కపట్టి ఏడ్చినా లెక్క చేయవేమమ్మా
అక్కున నను చేర్చుకొని నా ఆకలితీర్చవమ్మ
1. సాహితి సంగీతములు చనుదోయె కదనీకు
స్తన్యమీయ వేమమ్మా కడుపారగ ఈ సుతునకు
అర్ధాంతరముగనే అరకొఱగా గ్రోలగనే
నోరుకట్టివేయగా నీకు న్యాయమా
మాటదాటవేయగా నీకు భావ్యమా
2. అమ్మవు నువు కాకపోతె నాకెవ్వరు దిక్కమ్మా
అమ్మా దయగనకపోతె అనాధనే నౌదునమ్మ
మారాముచేసినా గారాలుపోయినా
నీ వద్దనేగదా మన్నించవమ్మా
నీ చెంతకే నన్ను చేరదీయవమ్మా
3. కొందఱు నీ కరుణతో కవిపుంగవులైనారు
ఇంకొందఱు నీ కృపతో గానశ్రేష్ఠులైనారు-సంగీత స్రష్టలైనారు
వాగ్గేయకారులైన వారిదెంత భాగ్యమో
నీ పదములు సాధించగ చేసిరెంత పుణ్యమో
నీ వరములు ప్రాప్తించగ బ్రతుకెంత ధన్యమో
నా బ్రతుకెంత ధన్యమో

Thursday, November 12, 2009

https://youtu.be/BIyjjWPunbo

సంగీతం సౌందర్యరాశి
సాహిత్యం సమకూరితేనె పరిపూర్ణత విలసిల్లు
సంగీతం అపరంజి సదృశి
పసిడికి (కవి)తావబ్బితేనె పరిమళాలు వెదజల్లు

1. శ్రుతి సుకుమారంగా- లయనే హొయలుగా
(సం)గతులు గమకాల-చిరునవ్వులు చిందించినా
తన్మయత్వమే లేక శోభించదు
కవితాత్మ లేకుండ రాణించదు

2. వర్ణాల వలువలతో- రాగాల నగలతో
స్వరసుమాలతో ఎంత-సింగారించుకోగలిగిన
భావ ప్రకటనే లేక భాసించదు
మనోధర్మమే లేక మహితమవ్వదు

3. అనురాగం రంగరించి-రాగమాలపించాలి
ఎద తాళం మేళవించి-ఎలుగెత్తి పాడాలి
పదములు పదిలంగా-అక్షరాలు లక్షణంగ
పలికితేనె పాట ఎపుడు-మధువులు చిందు

సుశారీర లతికయే-కనులవిందు
సుశారీర గీతికయే-చెవులవిందు

Wednesday, November 11, 2009

క’సాయి’ లోన సాయిని చూడు
సారాయి లోను సాయి ఉన్నాడు
ఏసానీయింటిలో సాయి దర్శనమిస్తాడు
అంతావసాయి లోను సాయి అవతరిస్తాడు
చూసావాయిలలో అంతా సాయి మయం
మనసాయే ’మనసాయే నా’ మదియే ప్రేమమయం
1. పైసాయే పరమాత్మ తెలుసుకో ఈ సత్యం
గోసాయే అంతరాత్మ గ్రహియించు ఇది నిత్యం
ఊసాయే ఉత్తుత్తి ఈ బ్రతుకే బుద్బుదప్రాయం
బానిసాయే వ్యసనాలకు భవితే కంటకప్రాయం
2. మురిసాయే తలపులన్ని సాయిని తలవగనే
కురిసాయే మమతలన్ని సాయిని కొలువగనే
విరిసాయే ఎద కలువలు సాయి చూపు తగలగనే
జడిసాయే దుష్కర్మలు సాయి వైపు నడవగనే

’మది’ద్వార’కసాయి లోన సాయిని చూడు
మనసా’రాయి” లోను సాయి ఉన్నాడు
ఏ’సానీ’చర్చయినా సాయి దర్శన మిస్తాడు
అంతావసాయి లోను సాయి అవతరిస్తాడు
చూసావాయిలలో అంతా సాయి మయం
మనసాయే ’మనసాయే నా’ మదియే ప్రేమమయం
ఏల నా స్వరములో మాధుర్యమే పలుకదు
ఏల నా గళములో మకరందమే చిలుకదు
ఎందుకు భారతి -నాకీ దుస్థితి
ఎరిగించవే తల్లి -గాన జ్ఞాన సరస్వతి

1. ఒనరించినానేమొ గతజన్మలోనా
నీ ఉపచారాన నేనపచారము
చేసితినెవరినొ సంగీతజ్ఞుల
గర్వాతిశయమున అపహాస్యము
పశ్చాత్తాపమే నా దోష పరిహారం
పరితప్త హృదయమె నా నివేదనం

2. పాడితినేమో ఎరుగక ఎపుడైన
పదపడి అపశ్రుతిలో గీతాలు
నుడివితినేమో ఎంచక ఎపుడైన
పదముల అపరాధ శతాలు
శిక్షణయే నాకు తగిన శిక్ష
సాధనయే నాకిక అగ్నిపరీక్ష

3. వహియించినాను చిననాటి నుండి
నా గొంతు ఎడల నిర్లక్ష్యము
కనబఱచలేదు అలనాటి నుండి
సంగీతమంటే సౌజన్యము
ఇకనైన ప్రసాదించు ప్రాయశ్చిత్తం
పైజన్మకైనా దయచేయి (సు)స్వరవరం

Tuesday, November 10, 2009

స్వామి శరణమంటే నిత్య సౌఖ్యము
స్వామి వెంట ఉంటే స్వర్గలోకము
స్వామి నీవె భారమంటె నిశ్చింతయే
ఆర్తిగ నువు పిలువగనే స్వామి ప్రత్యక్షమే

స్వామి శరణమంటే నిత్య సౌఖ్యము
స్వామి వెంట ఉంటే స్వర్గలోకము
స్వామి నీవె భారమంటె నిశ్చింతయే
ఆర్తిగ నువు పిలువగనే స్వామి ప్రత్యక్షమే

రాళ్ళే రబ్బరులై ముళ్ళేపూలై
అడుగడుగూ సాగుతుంది రాచబాటలో
వణికించే చలి వశపోని ఆకలి
నీ తెఱువుకే రావు స్వామి దీక్షలో
వింతవింత అనుభూతులు వనయాత్రలో
వినూత్నమైన మార్పులు జీవనయాత్రలో

స్వామి శరణమంటే నిత్య సౌఖ్యము
స్వామి వెంట ఉంటే స్వర్గలోకము
స్వామి నీవె భారమంటె నిశ్చింతయే
ఆర్తిగ నువు పిలువగనే స్వామి ప్రత్యక్షమే

వ్యసనాలు బానిసలై దురలవాట్లుదూరమై
స్వామి దాసులౌతారు మాలవేయగా
అనుట వినుట కనుటలు నీ ఆజ్ఞకు లోబడి
చిత్తము స్థిరమౌతుంది శబరి చేరగా
చిక్కుముడులు విడిపోవును ఇరుముడినే మోయగా
పద్ధతిగా బ్రతికేవు పద్దెనిమిది మెట్లనెక్కగా
స్వామి నెయ్యభిషేక దర్శనమవగా.....
మహిమాన్విత మకరజ్యోతి సందర్శన మవగా......

స్వామి శరణమంటే నిత్య సౌఖ్యము
స్వామి వెంట ఉంటే స్వర్గలోకము
స్వామి నీవె భారమంటె నిశ్చింతయే
ఆర్తిగ నువు పిలువగనే స్వామి ప్రత్యక్షమే

Saturday, November 7, 2009


నిష్ఠగ నీవుండకుంటె దీక్షలెందుకు
నియమాలు పాటించక వ్రతములెందుకు
నోరారా పలుకనిదే శరణుఘోష ఎందుకు
మనసారా పాడనిదే స్వామి భజనలెందుకు

1. తొలికోడి కూయకనే –ఉలికిపడిలేవనపుడు
నియమాలమాల నీ మెడలొ ఎందుకు
ఒళ్లుజివ్వుమననప్పుడు-స్వామిశరణమననప్పుడు
గోరువెచ్చనైననీటి స్నానమెందుకు

2. మనసులో వర్ణాలు మాయమే కానప్పుడు
నీలివస్త్రధారణతో తిరుగుటెందుకు
ఒడుదుడుకులతో నడవడి-గడబిడగా తడబడితే
పాదరక్షలే లేని ఫలితమెందుకు

3. అలంకారప్రాయమే-విభూతి చందనాలు
భృకుటిపైన దృష్టి నీవు సారించనపుడు
చిత్తచాంచల్యమై –ఇంద్రియ చాపల్యమై
స్వామిపూజచేసినా సాఫల్యం కాదెపుడు

4. షడ్రుచులతొ భిక్షలు-ఉపహార సమీక్షలు
నాలుక నీ ఏలికైతె ఏకభుక్తమెందుకు
భుక్తాయసమైనపుడు ఏకభుక్తమెందుకు
అర్ధా-పావూ మండలాలు-వాటంకొద్ది వైష్ణవాలు
మోజుకొరకు దీక్షలైతె మోక్షమెందుకు-శబరి లక్ష్యమెందుకు
మండలదీక్ష కానప్పుడు మాలెందుకు-నియమాలెందుకు
5. అమ్మ ఆజ్ఞ లేనప్పుడు-భార్య కుదరదన్నప్పుడు
అయ్యప్ప ఆనతీ దొరకదెప్పుడు
గుండెయె గుడియైనప్పుడు-ఎద సన్నిధానమెపుడు
నీ శరీరమే శబరిధామము
తోడునీడస్వామినీకు సదా శరణము
స్వామి సదా శరణము-స్వామిశరణము
రచన:రాఖీ -9849693324

Tuesday, November 3, 2009

https://youtu.be/0rqoFV2n08Y

అమ్మామాయమ్మా ఓ అమ్మలగన్నయమ్మ 
ముగురమ్మలకే నీవు మూలమందురు గదయమ్మ 
కవులరాతలే నేతి బీరలు- 
ప్రేమ అనురాగం కుందేటి కొమ్ములు 

1. నీ నెత్తుటిలో నేను నెత్తురు ముద్దగ 
బొడ్డుపేగు ముడివేసి నను పసిగుడ్డుగ 
మోసావుగదమ్మా మురిపెంగ తొమ్మిది నెలలు 
కన్నవెంటనే బరువైనాన నను సాకగ ఇలలో 

 2. ఎంగిలాకులే పొత్తిళ్ళుగా 
లాలాజలమే నీ చనుబాలుగా
భావించి విసిరావా చెత్తకుండీలో 
వదిలించుకున్నావా నను పెంటబొందలో 

3. కుక్కలైనా పీక్కతినలేదు కాసింత జాలితో 
ఒక్కమనిషీ నను గనలేదు పిసరంత ప్రేమతో 
మానవజాతికే నేను మచ్చనైపోతి 
నా కన్నతల్లికే నేను శత్రువైపోతి 

 4. అనాథకున్న బాధెంతో నీవెరిగేవా 
అమ్మా అనుమాటకైన అర్థం తెలిసేనా 
కన్నవెంటనే నను చంపవైతివే 
కరుణ తోడనూ కాస్త పెంచనైతివే


మణిదీపం నీ రూపం
అపురూపం నీ స్నేహం
కలిపింది మనలను ఏదో మధుర స్వప్నం
’కల చే’దైపోవును ఎదురైతే నగ్నసత్యం
1. ఎప్పటికైనా నువ్వు నాకపరిచితం
అయిపో నేస్తమా ఊసులకే పరిమితం
వాస్తవాలు దుర్భరం కఠినాతికఠినం
జీర్ణించుకోలేము ఏనాటికి కటిక నిజం
2. పొరపడి చిరునామా తెలుపనే తెలుపకు
తారసపడి గుర్తించినా నన్ను పలకరించకు
నీ గుట్టును ఎన్నటికీ విప్పనే విప్పకు
వేసుకున్న మేలిముసుగు కాస్త జారనీకు
3. ఊహకు భిన్నమైతె భరియించలేముగా
ఆశలుఅడియాసలైతె సహియించలేముగా
దూరపు కొండలే నునుపన్న తీరుగా
సాగనీ మనస్నేహం సాగినంత కాలం

Monday, November 2, 2009

https://youtu.be/OD0Be_T9kAY

ఓ నా గీతమా! నా జీవితమే నీకంకితము
ఓ భావ సంచయమా! నా సర్వస్వము నీ కర్పితము

1. ఏనాడు ఉదయించావో నా ఎదలోతుల్లో
ఏమూల దాగున్నావో నా అంతరాలలో
నిను వెలికి తీయడానికి ఎంతెంత శోధించానో
నిను బయట పెట్టడానికి ప్రయాసెంత చెందానో
నీకేమెరుకా ఓ నా కవిత-ఊహించనైనా లేవు నా గుండెకోత

2. పదములు పొసగక పాట్లెన్ని పడ్డానో
చరణాలు సాగక సమయమెంత ఒడ్డానో
నిద్రలేమి రాత్రులు ఎన్నెన్ని గడిపానో
నిద్రమధ్య ఎన్నిసార్లు ఉలికిపడి లేచానో
నీకేమెరుకా ఓ నా కవిత-ఊహించనైనా లేవు నా గుండెకోత

3. పురిటినొప్పి సంగతి పురుషుణ్ణయీ అనుభవించా
మరణ యాతనన్నదీ జీవిస్తూనె రుచిచూసా
ఆకలీదప్పికలన్నీ నీ ధ్యాసలొ నేమరిచా
లోకమంత మెచ్చిన నాడే రాఖీ శ్రమ సార్థకత
నన్ను వీడిపోకుమా ఓనా కవితా
నీవు తోడు లేనినాడు నా బ్రతుకేవృధా
దిక్కులు చూడకు-దిక్కే లేదనుకోకు 
దిగులు చెందకు-తోడెవరు లేనందుకు 
అడుగు ముందుకేయవోయి ఓ బాటసారి 
కడదాక నిను వీడిపోదు ఈ రహదారి 

 1. అమ్మలాగ కథలు చెప్పి నిన్నూరడిస్తా 
నాన్నలాగ చేయి పట్టి నిను నడిపిస్తా 
మనసెరిగిన నేస్తమై కబురులెన్నొ చెబుతా
 ఎండావానల్లోనూ నీకు గొడుగలాగ తోడుంటా

 2. రాళ్ళూరప్పలుంటాయి కళ్ళుపెట్టి చూడాలి 
ముళ్లూ గోతులు ఉంటాయి పదిలంగ సాగాలి 
వాగూవంకలన్నీ ఒడుపుగ నువు దాటాలి 
చేరాలనుకున్న దూరం క్షేమంగ చేరాలి 

 3. అనుకోని మలుపులు ఎదురౌతు ఉంటాయి 
పయనంలో మామూలుగ ఒడుదుడుకులు ఉంటాయి సేదదీర్చుకోవడానికి మజిలీలూ ఉంటాయి చలివేంద్రాలుంటాయి అన్న సత్ర్రాలుంటాయి 

 4. ఏమరుపాటైతే ఎదురౌను ప్రమాదాలు 
ఆదమరచి నిదురోతే అర్ధాంతరమే బ్రతుకులు 
నిర్లక్ష్యం తోడైతే ఎవరు కాపాడగలరు 
 గమ్యమొకటె కాదు ఆనందం రాఖీ ! గమనమంత కావాలీ