Tuesday, July 24, 2012


అమ్మా శ్రీ లలితా శివాత్మికా - నివాళి నీకిదే నిర్మల చరిత
కాత్యాయిని కాదంబరి కమలలోచని- సహస్ర నామాంకిత సకల లోకజనని
1.    అతివలంత జేరి నిను ధ్యానించిరి- అలివేణులందరూ ఆసన మందించిరి
అ౦గనలంత కలిసి అర్ఘ్యాదులనిచ్చిరి- పడతులంత గూడి పాదపూజ జేసిరి
                                                          ||అమ్మా శ్రీ లలితా ||
2.     అంబుజాక్షులందరూ అభ్యంజన మొనరించిరి- వనితలంత నీకు పట్టు వస్త్ర మిచ్చిరి
గరిత లంత జేరి గంధమ్ము బెట్టిరి -తెరవ లంత నీకు తిలకమ్ము దిద్దిరి
                                                          ||అమ్మా శ్రీ లలితా ||
3.     పూబోడులంత నీకు పూమాలలు వేసిరి- సుదతులంత నీ సహస్ర నామాలు చదివిరి
తరుణులంత తపన పడి ధూపమ్ము వేసిరి- ప్రమదలంత భక్తితొ ప్రమిదలు వెలిగించిరి
                                                          ||అమ్మా శ్రీ లలితా ||
4.     నెలతలంత నీకు నైవేద్యము నొసగిరి- ముదితలంత ముదమార తాంబూల మిచ్చిరి
హేమలంత ప్రియమారగ హారతులిచ్చిరి- కాంతల౦త ముక్తకంఠ గీతమాలపించిరి
                                                          ||అమ్మా శ్రీ లలితా ||
5.    భామలంత కలిసి నీ భజనలు జేసిరి- నారీమణులందరూ నాట్యాలు జేసిరి
మగువలంత నీకు మనసారా మ్రొక్కిరి- రమణులంత నీ ముందర సాగిల పడిరీ
                                                         ||అమ్మా శ్రీ లలితా ||
                                                                                  

No comments: