Friday, May 12, 2017

శుభోదయం-భవితకు అభయం!

కాలం సాగుతోంది నీ వెంట పడి
జీవితమే చిక్కుకుంది నీతో ముడిపడి
నీ చేతన మా శ్వాసగా
నీ వికాసమే ఆశగా
ప్రయత్నం మడమతిప్పకుంది
విశ్వాసం విధితో పోరాడుతోంది

1.శిఖరాలు లోయలెన్నో ఆగని నీ పయనంలో
ఆటుపోటు కెరటాలే నీ బ్రతుకు సంద్రంలో
అడుగడుగూ అవుతోంది నీకో సవాలు
అధిగమించి ఋజువు పరచు ప్రజ్ఞాపాటవాలు
నీ ప్రగతే మా ఆర్తిగ
నీ నడతే ఒక స్ఫూర్తిగ
సాధనయే దారి చూపుతోంది
సాహసమే వెన్ను తట్టుతోంది

2.అలుపెరుగని సూరీడే నీకు ఆదర్శం
వడివడిగా పరుగులిడే సెలయెరే గురుతుల్యం
ఉఛ్వాసనిశ్వాసలు ఉదయాస్తమయాలు
అడ్డంకులు ఒడుదుడుకులు కొండలుకోనలు
నీ గమ్యం కడురమ్యమై
నీ ధ్యేయం జనక్షేమమై
వెలుగులు పంచాలి విసుగుచెందక
వెతలను తీర్చాలి ఏదీ ఆశించక

No comments: