॥రాఖీ॥ప్రేమాన్వితం
ముందు వెనక చూడనిది
ఉచితానుచితం ఎంచనిది
ఏ తర్కాలకు అందనిది
ఏ త్యాగాలకు వెరవనిది
అనురాగమే అది అనన్యమైనది
ప్రేమైక జీవనం ధన్యమైనది...
1.అమ్మ పేగుబంధం తో-పురుడు పోసుకున్నది
చిన్ననాడు స్నేహంతో -చెలిమి చేసుకున్నది
కాకి ఎంగిళ్ళతో-కలగలిసిపోయింది
చెట్టపట్టాలతో-చెలరేగిపోయింది
మాయమర్మం ఎరుగనిది
కల్లాకపటం తెలియనిది
ఏ కలమూ రాయలేనిది
ఏ కుంచె దించలేనిది
అనురాగమే అది అనన్యమైనది
ప్రేమైక జీవనం ధన్యమైనది...
2.కౌమార ప్రాయంలో-రంగుల కలలు కన్నది
యవ్వనాన రివ్వుమంటూ-ఎల్లలెరుగ కున్నది
చెలియ చిరునవ్వుకే-పరితపించిపోయింది
చెలికాని స్పర్శకే-పులకరించిపోయింది
మాటల కోటలు కట్టింది
తిరుగుబాటుచే పట్టింది
ఏ కులమూ వంచలేనిది
ఏమతమూ త్రెంచలేనిది
అనురాగమే అది అనన్యమైనది
ప్రేమైక జీవనం ధన్యమైనది...
3.అర్ధాంగితొ అనునిత్యం-ప్రణయ కావ్య దాంపత్యం
సంతానపు సౌభాగ్యం-వాత్సల్యపు సాంగత్యం
అరమరికలు లేనిది-అద్భుతమౌ బాంధవ్యం
ఏ స్స్వార్థం లేనిదీ-అపురూప రక్తబంధం
బ్రతుకును అంకిత మిచ్చేది
భవితను తీరిచి దిద్దేది
ప్రతిజీవి కోరుకునేది
ప్రతిమనిషి ఆశపడేది
అనురాగమే అది అనన్యమైనది
ప్రేమైక జీవనం ధన్యమైనది...
4. వివిధమైన రూపాల్లో- విశ్వవ్యాప్త మైనది
వేరువేరు కాలాల్లోనూ-ఉనికి చాటుకున్నది
ఇష్టమన్న మాట సైతం-అల్పమే ప్రేమ ముందు
అభిమానం అనుపదమైనా-ప్రేమకు ఎటు సరిపోదు
అనుభూతికి మాత్రం అందునది
హృదయానికి మాత్రమె తెలియునది
కారణమేదో చెప్పరానిదిమ
మరణం కూడా ఆపలేనిది
అనురాగమే అది అనన్యమైనది
ప్రేమైక జీవనం ధన్యమైనది...
*** **** *** *** *** *** *** ***
ప్రేమ గురించి కావ్యం రాసినా పూర్తిగా చెప్పడం కష్టం
నాలుగు చరణాల్లో కూర్చడానికి అది మరీ మరీ కష్టం
మీ ప్రతి-స్పందనతో నే నినదిస్తాసు!!
No comments:
Post a Comment