"వలస"-రాఖీ
తల్లిని విడిచి ఇల్లును విడిచి
నేల తల్లిని విడిచి పుట్టినూరును విడిచి
పయనమై పొయినావా చిన్ని తమ్ముడా
పదిలంరా ప్రతి అడుగున తుమ్మ కంపరా
పల్లెగాని పల్లెకు భాషరాని చోటుకు
దేశంవిడిచావుగా వలసగా
పరదేశానికి బ్రతుకు తెరువుగా
ఉన్న ఊరు కొంతైనా చేయూతనీయనపుడు
బంధువులు స్నేహితులు ఊరడించ లేనప్పుడు
బీడువడ్డ చేనుచెల్కనెవ్వరికో కుదువబెట్టి
భార్యా పిల్లలను పుట్టింటికి జారగొట్టి
గుబులునంత దిగమింగి గుంభనంగ బింకమంది
బొంబాయి బొగ్గుబాయి దుబాయి చమురుబాయి
చేరినదేదైనా ముందు నుయ్యివెనుక గొయ్యి
పొట్టచేతబట్టుకొని ఆశకూడగట్టుకొని
పరువును విడిచావుగా పనినెంచక బేలగా
నలుగురుండుగదిలో నలుబదిమందుంటూ
ఏపూటో తింటూ మరోపూట పస్తులుంటు
ఒక్కొక్క రూపాయి పదిలంగా కూడబెడుతు
తీసుకున్న అప్పులన్ని సక్రమంగ ముట్టజెప్తు
దినదినగండంగా ఏళ్ళకేళ్ళుదొర్లిస్తూ
యజమానికోపానికి తగుమూల్యం చెల్లిస్తూ
ప్రమాదాలు ఒకవైపు దుర్భరస్థితులొకవైపు
బ్రతుకును బలిచేస్తూ భవితను కబళిస్తూ
దేహం విడి'చావుగా పరలోకం వలసగా
No comments:
Post a Comment