Friday, September 28, 2018

కొండాకోనా వెదికి వెదికి-గండశిలను గాలించి
గుండెలోని భావానికి-అందమైన రూపమిచ్చి
ఏడుకొండలమీద-నిలిపినాము భక్తిమీర
అండగా ఉంటావని-నమ్మినాము మనసారా
వమ్ము చేయబోకురా వేంకటేశ్వరా
మమ్ము మరువ బోకురా మా హృదయేశ్వరా

1.వైకుంఠ దర్శనము -మాకు గగన కుసుమమని
వాసిగా తిరుమలలో -స్థిరవాసమున్నావు
రానుపోను దూరమయ్యే -కాలమింక భారమయ్యే
కల్మషాలు తొలగించి శుద్దిచేసి సిద్దపరిచాం
కనికరించి మాఎదలో సిరితొ కూడి ఉండరా

వమ్ము చేయబోకురా వేంకటేశ్వరా
మమ్ము మరువ బోకురా మా హృదయేశ్వరా

2.మానవత నింపుకుంటాం-  అభిషేకపు పాలుగా
సుగుణాలు పెంచుకుంటాం-నీ పూజకు పూలుగా
నైవేద్యమిచ్చుకుంటాం-పండంటి జీవితాలను
కైంకర్య మొనరిస్తాం- రెప్పపాటు కాలమైననూ
హారతులేపడతాం-మా ఆత్మ జ్యోతులను
వమ్ము చేయబోకురా వేంకటేశ్వరా
మమ్ము మరువ బోకురా మా హృదయేశ్వరా

https://www.4shared.com/s/f1HLMQ3BKgm





No comments: