Friday, September 28, 2018


రచన,బాణీ,వాణీ:రాఖీ
"జీవన యానం"

మౌనం దాల్చిన భావాలెన్నో
కన్నుల జారిన అశ్రువులెన్నో
తీరం చేరని స్వప్నాలెన్నో
కంచిని చూడని కథలెన్నెన్నో
నేస్తమా
పరిచయమెరుగని బాటసారులం
కలయిక తెలియని రైలు పట్టాలం

పయనం ఎక్కడ  మొదలయ్యిందో
గమ్యం ఎప్పుడు చేరరానుందో
దారంతా ఊహకు అందని మలుపులు ఎన్నో
దాహంతీర్చి అక్కునజేర్చే చలివేంద్రాలెన్నో
అలసటతీర్చి బాసటనిలిచే మజిలీలెన్నెన్నో
ఎందాక కలిసుంటామో ఏనాడు మరుగయ్యేమో
నేస్తమా
వాడనీకు మైత్రీ సుమం
వీడినా ఆరనీకు స్నేహదీపం

అనుభవాలను అనుక్షణం పంచుకుంటూ
అనుభూతులనే పరస్పరం నెమరేసుకొంటూ
నవ్వుల వెన్నెల  పూయిద్దాం అమాసనాడూ
ఆనందాలను తెగ పారిద్దాం ఎడారిలోను
రెప్పపాటు ఐతేనేం గొప్పనైనదీ జీవితం
నేస్తమా
సాగిపోని పాటగా ప్రయాణము
మిగిలిపోనీ స్మృతులే ఆసాంతము

https://www.4shared.com/s/fdrhnXriffi

No comments: