Friday, September 14, 2018

రచన:రాఖీ

"ప్రాణం ఖరీదు"

(కొండగట్టు బస్సు దుర్ఘటన నేపథ్యంలో)

కారకులెవరు కర్తలు ఎవరు
నమ్మి నిశ్చింతగా ఉన్నందుకా
వేరు దిక్కులేక బస్సునెక్కినందుకా
క్షతగాత్రులు కొందరు
విగతజీవులింకొందరు
ప్రతి నిర్లక్ష్యము మరలిరాని జీవితం
ప్రతి ప్రమాదము తీరని పెను విషాదము

ముక్కుపచ్చలారని పసివాళ్ళు
పారాణీ ఆరని పెళ్ళికూతుళ్ళు
ఆశలమూటతో నవ యువకులు
బాధ్యలే తీరని కుటుంబ యజమాన్లు
ఏ పాపం చేసారని ఈ శాపం
ఏనేరం చేసారని ఈఘోరం
విధివిలాసమంటూ సరిపుచ్చుకోవడమా
విధినిర్వాహణలో యంత్రాంగ వైఫల్యమా

కాలం చెల్లినా నడిపే వాహనాలు
తనిఖీలు మరమ్మత్తులు దాటేసే వైఖరులు
రహదారుల పట్ల ప్రభుత ఉదాసీన విధానాలు
మద్యపాన చరవాణులు ఘాతుక హేతుకాలు
కారణమేదైతేం బ్రతుకులె కద మూల్యము
పరిహారమెంతైనా పోయగలమా ప్రాణము
ఇకనైనా మేలుకొంటె నివారించగలమేమో
జాగ్రత్తలు తీసుకొంటె నియంత్రించగలమేమో

No comments: