Tuesday, June 25, 2019

మిరపకాయ బజ్జీ-పేరు చెప్పగానే తిన బుద్ది
ఘుమఘుమ వాసన-నీళ్ళూరగ రసన
బంగారు వన్నెతో అలరారు చుండగ
బండిని దాటిపోవ బ్రహ్మ కైన సాధ్యమా

1.శ్రేష్ఠమైన పచ్చిమిర్చి-రెండవకుండ చీల్చి
మధ్యలోన ఉప్పు వాము చింతపండు కూర్చి
చిక్కనైన శనగపిండిలొ ఒకే వైపు ముంచి
కాగిన నూనెలో కడాయిలోకి జార్చి
కాలీకాలకుండ జారమీద ఆరనిచ్చి
మరిగిన నూనెలో మరలా వేయించి
తరిగిన సన్ననైన ఉల్లిపాయల్ని చల్లి
 గరం మీద కొరికితింటె నా సామి రంగా
చస్తేనేం తిన్నాకా ఉన్న ఫళంగా

2.వేడితో ఒకవైపు కారంతో మరోవైపు
సుర్రుసుర్రుమన నాల్కె హుషలుగొట్ట తింటుంటే
ముక్కునుండి కళ్ళనుండి గంగధార కడుతుంటే
ఎన్ని తిన్నామో తెలియనంత మైమరచి
పెదవి నుండి పెద్దప్రేగు చివరి వరకు మండినా
ఆపమెపుడు తినడాన్ని తనివి తీరునంతదాక
తెలుగువారికెంతగానొ ప్రియమీ చిరుతిండి
ప్రతిరోజూ తిన్నాగాని మొహంమొత్తబోదండి
మిర్చిబజ్జి తినని జన్మ నిజంగానె దండగండి

No comments: