Saturday, June 22, 2019

https://youtu.be/PoPTz1iui4I

రచన:గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

ఒళ్ళంతా కళ్ళు చేసుకొని-
కళ్ళల్లో వత్తులేసుకొని
పగలంతా పనులు మానుకొని-
రేయంతా నిదుర వదులుకొని

చకోరి పక్షుల్లా వేచి చూసాము రామా
చాతక పక్షుల్లాగా తపన పడ్డాము రామా
ఇళ్ళూ వాకిళ్ళ ధ్యాస మరిచాము రామా
పద్నాలుగేళ్ళూ దారి కాచాము రామా

నువ్వింక వస్తావని-మా ఆర్తి తీర్చేవని
మారాజు వౌతావని-మమ్మేలుకొంటావి
రఘుకుల సోమా రామా కారుణ్య ధామా
దశరథ నందన రామా  హే పట్టాభిరామా

అనుకున్న క్షణము వచ్చిందిగా
కల నిజమై  ఎదుటే నిలిచిందిగా
స్వాగతమయ్యా సాకేత రామా
సుస్వాగతమయ్యా హే సార్వభౌమ

నీవేలేనీ రాజ్యం బీడై పోయింది
నీవేలేని నగరం అడివే అయ్యింది
కష్టాలు తీర్చేవాళ్ళు కరువాయెగా
కన్నీళ్ళు తడిచేవాళ్ళే లేరాయెగా


నువ్వొచ్చినావంటె మా బత్కులె పండేను
నువురాజ్యమేలితెమా కడుపులె నిండేను
విజేతవై నువ్వు వచ్చావయ్యా
అయ్యోధ్యపురికే వన్నె తెచ్చావయ్యా

సుగ్రీవునితో మైత్రి చేసావట
బలశాలివాలిని మట్టుబెట్టావట
మారుతినే బంటుగ చేసుకున్నావట
అంబుధికే వారధికట్టి దాటావట

సీతమ్మను చెఱనే బెట్టిన-
లంకేశుడు రావణున్ని
ఒక్క బాణంతో నేల కూల్చావట
శరణన్న విభీషణున్కి పట్టం కట్టావట

దండాలు నీకు కోదండ రామయ్యా
జేజేలు నీకివే మాజానకి రామయ్యా

నీ చూపు పడితేనే మేఘాలు మెరిసేను
నువ్వడుగు పెడితేనె వానల్లు కురిసేను
పంటలే పండేను గాదెలే నిండేను
ఊరూర ఇకపై ప్రతిరోజు పండగౌను

నీ గాధలే మాకు మార్గాన్ని చూపేను
మా బాధలింక మటుమాయమయ్యేను

ఇంటింట ప్రతి పూట నవ్వులే విరిసేను
ప్రతినోట రామ రామ రామయే పలికేను
వందన మిదిగో అందాల రామా
మావినతులందుకో నీలమేఘశ్యామ

No comments: